వైఎస్సార్‌సీపీ ఎన్నికల కోసం పక్కా ప్లాన్‌తో సిద్ధమవుతోంది.. నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. సామాజిక సమీకరణాలు.. స్థానిక పరిస్థితులకు తగినట్లుగా అడుగులు వేస్తోంది. ఆ దిశగా అభ్యర్థుల్ని మార్చేస్తోంది.. కొందరు సిట్టింగ్‌లకు స్థానచలనం జరిగితే.. మరికొందర్ని తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తోంది. ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేయగా.. తాజాగా మూడో జాబితా కూడా వచ్చేసింది. అయితే ఈసారి లిస్ట్‌లో ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి అవకాశాలు కల్పించడం విశేషం.
ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ మూడు అసెంబ్లీ టికెట్లు కేటాయించింది. కొండేపిలో ఆదిమూలపు సురేష్, కోడుమూరులో సురేష్ సోదరుడు ఆదిమూలపు సతీష్, మడకశిరలో మంత్రి సురేష్ బావ తిప్పేస్వామి పోటీ చేయనున్నారు. అంతేకాదు ఒకే కుటుంబం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ-చీపురుపల్లి, ఆయన భార్య ఝాన్సీ-విశాఖ ఎంపీ, బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు-విజయనగరం ఎంపీగా పోటీ చేయబోతున్నారు. అంతేకాదు మరొ కొన్ని కుటుంబాల నుంచి ఇ్దదరికి కూడా టికెట్లు కేటాయించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
మరోవైపు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు మూడో జాబితాను విడుదల చేశారు. గత ఎన్నికల్లో ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్‌ను సమన్వయకర్తగా నియమించారు. విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి మంత్రి బొత్స సతీమణి ఝాన్సీని సమన్వయకర్తగా నియమించారు. శ్రీకాకుళం లోక్‌సభ సమన్వయకర్తగా పేరాడ తిలక్‌కు బాధ్యతలు ఇచ్చారు. కర్నూలు లోక్‌సభ స్థానం సమన్వయకర్తగా మంత్రి గుమ్మనూరి జయరాం.. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తిరుపతి లోక్‌సభ స్థానంకు సమన్వయకర్తగా నియమించారు. విజయవాడ లోక్‌సభ స్థానం సమన్వయకర్తగా కేశినేని నానిలకు బాధ్యతలు ఇచ్చారు.
అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే.. మంత్రి జోగి రమేష్‌ను పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తగా.. ఎమ్మెల్సీ మేరిగ మురళిని గూడూరుకు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను టెక్కలికి సమన్వయకర్తలుగా నియమించారు. ఏపీఐఐసీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిని రాయదుర్గం, మాజీ ఎమ్మెల్యే మూతిరేవుల సునీల్‌కుమార్‌ను పూతలపట్టు, ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ విజయానందరెడ్డిని చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పిరియా విజయ, ఏలూరు జిల్లా చింతలపూడి కంభం విజయరాజు, ప్రకాశం జిల్లా దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అన్నమయ్య జిల్లా మదనపల్లె నిస్సార్ అహ్మద్, రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు విరూపాక్షి, కోడమూరు డాక్టర్ ఆదిమూలపు సతీష్, పెడన ఉప్పాల రాముకు బాధ్యతలు ఇచ్చారు.