భీమవరంలో సాంప్రదాయ కోడిపందాలను నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల తరువాత ఆప్తుల మద్య పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎటు వంటి ఆటంకాలు లేని సంక్రాంతిని రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నామని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చేది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరమని, ముఖ్యంగా పండుగ మూడు రోజులు ఇక్కడ భారీ ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తారని రఘురామ అన్నారు. కోడి పందాలు సంక్రాంతి సాంప్రదాయంలో భాగమని తెలిపారు. కోడి పందాల బెట్టింగులకు తాను వ్యతిరేకమని బెట్టింగుల పేరుతో కోడి పందాలను అడ్డుకోవద్దని రఘురామకృష్ణం రాజు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కాగా నాలుగేళ్ల తర్వాత ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్వస్థలానికి వచ్చారు. ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన రోడ్డు మార్గంలో భీమవరం బయలు దేరారు. రఘురామ రాక నేపథ్యంలో రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు.