టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును.. కాంగ్రెస్ నాయకురాలు, వైఎ్‌సఆర్ కుమార్తె షర్మిల శనివారం ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి, కుటుంబ సమేతంగా పెళ్లికి రావాలని ఆహ్వానించారు. అనంతరం షర్మిల విలేకరులతో మాట్లాడారు. తమ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని స్పష్టం చేశారు. తన కుమారుడు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబును పిలిచేందుకు మాత్రమే వచ్చానని, ఆయన కూడా పెళ్లి వేడుకకు హాజరై ఆశీర్వదిస్తానని చెప్పారని వెల్లడించారు. దివంగత వైఎ్‌సఆర్ కూడా తమ కుటుంబంలో జరిగిన వివాహాలకు చంద్రబాబును ఆహ్వానించారని, ఆయనా వచ్చి ఆశీర్వదించారని చెప్పారు. క్రిస్‌మస్ సందర్భంగా చంద్రబాబుకు స్వీట్లు పంపితే దాన్నీ తప్పు పట్టారని, ఇలా ప్రతి విషయాన్నీ రాజకీయాలతో ముడిపెట్టడం సరైంది కాదని షర్మిల అన్నారు. క్రిస్‌మస్ సందర్భంగా చంద్రబాబుతోపాటు కేటీఆర్, కవిత, హరీ్‌షరావులకూ స్వీట్లు పంపానని చెప్పారు. రాజకీయం అన్నది తమ వృత్తే కానీ.. అదే జీవితం కాదన్నారు. రాజకీయాల్లో స్నేహపూర్వక వాతావరణం ఉండాలే కానీ.. వ్యక్తిగత కక్షలు ఉండకూడదంటూ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు ఏ బాధ్యతలు ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పారు. వైఎ్‌సతో చంద్రబాబుకు ఉన్న స్నేహం గురించి చాలాసేపు చర్చించుకున్నామని, వైఎ్‌స గురించి బాబు చాలా గొప్పగా చెప్పారని షర్మిల వెల్లడించారు.