4 ఏళ్లుగా రాష్ట్రానికి పట్టిన పీడ, కీడుని భోగి మంటల్లో తగలపెట్టామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే సంక్రాంతిని తెలుగుదేశం -జనసేన ప్రభుత్వంలో ఘనంగా జరుపుకుందామని చెప్పారు. భోగి పండగ సందర్భంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడుతో కలిసి ఆదివారం ఉదయం రాజధాని ప్రాంతం మందడంలో నిర్వహించిన భోగిమంటల వేడుకల్లో పవన్ కళ్యాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగున్నర ఏళ్లుగా జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల జీవో కాపీలను భోగి మంటల్లో దహనం చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..‘‘నేడు రాజధాని రైతులకు వచ్చిన కష్టం రేపు పులివెందుల ప్రజలకు కూడా రావొచ్చు. తెలుగుదేశం - జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదని ఎన్నో కుట్రలు పన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంలో వెళ్తుంది. ఆ చీకటి పోయి వెలుగులు నింపాలనే సంకల్పంతో భోగి మంటలు వెలిగించాం. 5 కోట్ల ప్రజా రాజధాని కోసం 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతుల్లో నిజమైన సంక్రాంతి శోభ నిండాలి.’’ అని అన్నారు.