టీడీపీ జాతీయ అధ్యక్షుడు, చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆదివారం స్వగ్రామమైన నారావారిపల్లెకు రానున్నారు.ప్రతి ఏడాదిలాగే రెండురోజులు ఇక్కడే వుండి సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోనున్నారు. శుక్రవారమే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, ఆమె సోదరి లోకేశ్వరి, బంధువులు కంఠమనేని శ్రీనివాస్, శ్రీనివాస్ తదితరులు నారావారిపల్లెకు చేరుకోగా శనివారం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్, సినీనటుడు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, సోదరుడు నందమూరి రామకృష్ణ, చిన్న కుమార్తె తేజస్విని, నారా రామ్మూర్తి నాయుడి సతీమణి ఇందిర శనివారం మద్యాహ్నం నారావారిపల్లెకు చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 12,30 గంటలకు ఎ.రంగంపేటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో చంద్రబాబు దిగుతారు. అక్కడినుంచి స్వగృహానికి చేరుకొంటాడు. సాయంత్రం లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణిలు రానున్నారు. సోమవారం ఉదయం సినీనటుడు నారా రోహిత్ రానున్నారు.సంక్రాంతి పండుగకు ప్రముఖులు రానుండడంతో గ్రామంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ టీడీపీ నాయకులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆదివారం క్రీడాపోటీలు,ముగ్గుల పోటీలు నిర్వహించడానికి మైదానాన్ని సిద్ధం చేశారు.చంద్రబాబు తల్లిదండ్రుల సమాధుల వద్ద, కులదైవం నాగాలమ్మ ఆలయం వద్ద, గ్రామ దేవత దొడ్డి గంగమ్మ ఆలయం వద్ద పూజలకోసం పరిసరాలను శుభ్రం చేశారు.