అడవి జంతువుల వేటగాళ్ల నాటు తుపాకీ తూటాలకు ఉమాపతి(22) అనే యువకుడు బలయ్యాడు. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం కేఎం కండ్రిగ పంచాయతీ నాగాలయిండ్లు సమీపంలోని తూర్పు అటవీప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మేతకోసం అడవికి తోలిన ఎద్దు వెనక్కి రాకపోవడంతో ఎగువకంతల చెరువు గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఉమాపతి, శరత్‌లు వారి మేనమామ వెంకటే్‌షతో కలిసి వెతికేందుకు శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తూర్పు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. జంతువుల వేటకు వచ్చిన అదే గ్రామానికి చెందిన నాగరాజు, పాండియన్, శేఖర్‌లు వారికి ఎద్దును వెతకడంలో సహకరించారు. ఎద్దు ఆచూకీ దొరక్కపోవడంతో ముందుగా శరత్ ఊరికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఉమాపతి, వెంకటే్‌షలు ఇంటికి బయల్దేరారు. దారిలో ఉండగా తుపాకి పేలింది. తూటా తగిలి ఉమాపతి కుప్పకూలిపోయాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని వేటగాళ్లతో కలిసి వెంకటేష్ ఊరి సమీపంలోని బండ వద్దకు తీసుకొచ్చారు. నీళ్లు తాగించే ప్రయత్నం చేయగా, ఉమాపతి చనిపోయాడు. గ్రామస్తులంతా అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులొచ్చి నాగాలయిండ్లుకు చెందిన నాగరాజు, కేఎం కండ్రిగకు చెందిన పాండియన్, వెంకటేష్, శేఖర్‌లపై 304(2) సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజు తుపాకీతో కాల్చగా.. పాండియన్, శేఖర్ పక్కనున్నారని పోలీసులు తెలిపారు. ఏదో జంతువు వస్తోందని భావించి పొరపాటుగా ఉమాపతిని తుపాకీతో కాల్చానని నాగరాజు పోలీసులకు, గ్రామస్తులకు వివరణ ఇచ్చుకున్నాడు. తల్లిదండ్రులు బేబమ్మ, బాబు రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.