అనంతపురం జిల్లాకేంద్రం సమీపంలో వరుసగా చైన స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పుట్టపర్తి అర్బనపోలీసులు శనివారం అరెస్టు చేశారు. పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నల్లమాడ మండలం చౌటుకుంటపల్లికి చెందిన మల్లెల వినోద్‌కుమార్, బడవాండ్లపల్లికి చెందిన కుంచెపు చంద్రమోహన, కుటాలపల్లికి చెందిన మూడేకుల రవీంద్రనాయక్, దుద్దుకుంట కిరణ్‌కుమార్ అనే నలుగురు యువకులు ముఠాగా ఏర్పడి పుట్టపర్తి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో వరుస చైనస్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. గత జూలై 23 నుంచి ఈనెల 9 వతేదీ వరకు పలుప్రాంతాల్లో మహిళల మెడల్లో తాళిబొట్టు చైన్లను బలవంతంగా లాక్కొని వెళ్లారు. కాగా బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపి ఆ నలుగురు ముద్దాయిలను అరెస్టు చేశారు. అనంతరం వారి నుంచి 43.9 గ్రాముల బంగారు నగలను రికవరీ చేశారు. అలాగే నాలుగు సెల్‌ఫోన్లను, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలు వరసుగా బంగారు గొలుసుల దొంగతనాలకు పాల్పడి అనంతరం వాటిని పలు గోల్డ్ ఫైనాన్స కంపెనీల్లో బంగారు తాకట్టు పెట్టారన్నారు. దీంతో పోలీసులు నిందితులతో పాటు ఆయా ఫైనాన్సు కంపెనీల వద్దకు వెళ్లి బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మొదటి సారి చోరీకీ గురైన బంగారు గొలుసును వేలం వేశారని, దానిని సైతం రికవరీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. బంగారు నగల చోరీ కేసును ఛేదించిన అర్బనసీఐ కొండారెడ్డి, ఎస్సైలు వీరేష్, వెంకటరాముడు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.