చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు చేపడుతున్న సమ్మె శనివారంతో 33వ రోజుకు చేరింది. కుప్పం, పలమనేరు ప్రాజెక్టుల్లో ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద, చిత్తూరులో కలెక్టరేట్, కార్వేటినగరంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద సమ్మెను నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కోటి సంతకాలతో జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఫ చిత్తూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపడుతున్న సమ్మె శనివారం విరామం ప్రకటించి వర్కర్లు పనిచేస్తున్న వార్డుల్లో కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులతో తమ సమస్యలను చెప్పి.. సంతకాలు సేకరించారు. ఫ పలమనేరు సీడీపీవో కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్లు నిరసన తెలిపారు. వీరికి మాజీ మంత్రి అమరనాథరెడ్డి సంఘీభావం ప్రకటించారు. వర్కర్ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఫ కుప్పంలో అంగన్వాడీ వర్కర్లు సీడీపీవో కార్యాలయం వద్ద సమ్మె చేశారు. కోటిసంతకాల సేకరణ చేపట్టారు. ఫ కార్వేటినగరంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సమ్మె నిర్వహించారు. ఇక్కడా కోటి సంతకాల సేకరణ మొదలుపెట్టారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించే వరకు సమ్మెను విరమించేది లేదని అంగన్వాడీలు స్పష్టం చేశారు.