టీడీపీకి ఇటీవల షాకులు మొదలైన విషయం తెలిసిందే. ఇటీవల మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు టీడీపీకి గుడ్ బై చెప్పి చంద్రబాబు, లోకేశ్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. రంగారావు సత్తెనపల్లి సీటును ఆశించారని, కానీ టీడీపీ నాయకత్వం ఆ సీటును కన్నా లక్ష్మీనారాయణకు ఇవ్వడంతో రంగారావు మనస్తాపానికి లోనయ్యారని కథనాలు వచ్చాయి. ఈ కారణంగానే ఆయన చంద్రబాబు ఫొటోను ఎత్తి నేలకేసి కొట్టి, తీవ్రస్వరంతో ధ్వజమెత్తినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు సోదరుడు రాయపాటి శ్రీనివాస్ స్పందించారు. రంగారావు వ్యవహారశైలిని తాము ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. రాయపాటి శ్రీనివాస్ ఇవాళ గుంటూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాము ఎప్పుడూ ఇలా మాట్లాడలేదని, రంగారావు స్పందించిన తీరు సరికాదని అన్నారు. ఆయన మాట్లాడిన తీరును తాము ప్రోత్సహించడంలేదన్నారు. మొదటి నుంచి తమది ఉమ్మడి కుటుంబం అని, కానీ ఇటీవల తమ కుటుంబంలో చీలికలు వచ్చాయని రాయపాటి శ్రీనివాస్ వెల్లడించారు. తాము మాత్రం చంద్రబాబు, లోకేశ్ వెంటే నడుస్తామని, టీడీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్ లతో తమకు ఎలాంటి ఇబ్బందిలేదని అన్నారు.