ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 15, 2024, 08:40 PM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అక్కడ కీలక నిర్ణయం తీసుకుంది. అంతా ఊహించినట్లుగానే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా నియమించింది. కొద్దిరోజుల కిందటే ఈమె పార్టీలో చేరడం గమనార్హం. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పుడే ఆమెకు ఏపీసీసీ పగ్గాలు అప్పగిస్తారని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న గిడుగు రుద్ర రాజును రాజీనామా చేయాలని కోరగా.. ఆయన సోమవారం మధ్యాహ్నం తప్పుకున్నారు. తన రాజీనామా లేఖను ఖర్గేకు పంపించారు. రుద్ర రాజు తప్పుకున్న గంటల వ్యవధిలోనే ఇప్పుడు షర్మిలను ఆ స్థానంలో నియమించడం విశేషం.


2021, జులై 8న వైఎస్ షర్మిల.. తెలంగాణ వేదికగా వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఎన్నికలకు ముందు క్రియాశీలకంగానే ఈ పార్టీ పనిచేసింది. ఏమైందో ఏమో తెలియదు గానీ.. అసెంబ్లీ ఎన్నికల వేళ తమ పార్టీ ఎన్నికల బరిలో ఉండట్లేదని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. పార్టీ విలీనంపైనా చర్చలు జరిపినప్పటికీ అప్పుడు ఏం నిర్ణయం తీసుకోలేదు. తర్వాత ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ, ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన పార్టీని కూడా విలీనం చేశారు.


కాంగ్రెస్‌లో చేరాక ఆమెకు అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ప్రస్తుతం ఆమె తన కుమారుడి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. షర్మిల కుమారుడు వైఎస్ రాజా రెడ్డి.. అట్లూరి ప్రియను ఫిబ్రవరి 17న వివాహం చేసుకోనున్నారు. జనవరి 18న నిశ్చితార్థం జరగనుంది. ఈ నేపథ్యంలోనే సినీ, రాజకీయ ప్రముఖులకు షర్మిల స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికను అందిస్తున్నారు. ఇటీవల టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com