కనుమని పశువుల పండుగగా పిలుస్తారు. ఈ రోజున రైతులు పశువులను నదీ తీరాలకు, చెరువుల దగ్గరికి తీసుకువెళ్లి స్నానం చేయిస్తారు. పశువుల నుదుటున పసుపు, కుంకుమదిద్ది మెడలో మువ్వలపట్టీలు కడతారు.
కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేయబడిన వివిధరకాల కొప్పులను తగిలిస్తారు. వీపుపై అలంకార శోభితమైన పట్టీ తగిలిస్తారు. వాటిని పూజించి హారతిని ఇస్తారు. పశువులకు ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి వాటిని ఉత్సాహంగా ఊరేగిస్తారు.