భారత్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాల్లో స్థిరపడిన వ్యాపార వేత్తలపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వ్యాపార వేత్త విజయ్ మాల్యా, ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీ, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు తీసుకురావడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏల బృందం బ్రిటన్‌కు బయల్దేరింది. బ్రిటన్‌తోపాటు ఇతర దేశాలకు పరారైన వారి ఆస్తులను గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దీని కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి నేతృత్వంలోని ఉమ్మడి బృందానికి లండన్‌లోని భారత హై కమిషన్ ద్వారా బ్రిటన్‌లోని అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. భారత్‌లో లోన్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఈ ఆర్థిక నేరగాళ్లు సంపాదించిన ఆస్తులు, వారి బ్యాంకింగ్ లావాదేవీల గురించి సమాచారం పెండింగ్‌లో ఉంది. అయితే ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ.. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రాకు సన్నిహితుడు. యూపీఏ హయాంలో జరిగిన అనేక రక్షణ ఒప్పందాలపై ఆదాయపు పన్ను శాఖతో పాటు ఈడీ విచారణ ప్రారంభించిన వెంటనే 2016లో సంజయ్ భండారీ భారత్ నుంచి విదేశాలకు పరారీ అయ్యాడు.
విజయ్ మాల్యా, సంజయ్ భండారీ, నీరవ్ మోదీలను ఇప్పటికే భారత్ బహిష్కరించింది. దీంతో భారత్ బహిష్కరణపై ఈ ముగ్గురు అక్కడి హైకోర్టుల్లో అప్పీలు చేయడంతో బ్రిటన్‌లో వారి అప్పగింత పెండింగ్‌లో ఉంది. ఈడీ ఇప్పటికే భారత్‌లోని వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అలాగే విజయ్ మాల్యా, నీరవ్ మోదీల వేల కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడం ద్వారా డబ్బు కూడా రికవరీ చేశారు. మిగతా బకాయిలను కూడా త్వరలోనే రాబడతామని కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. ఈ క్రమంలోనే విజయ్ మాల్యా, సంజయ్ భండారీ, నీరవ్ మోదీలను భారత్‌కు తీసుకువచ్చేందుకు గత కొన్నేళ్లుగా కేంద్రం ప్రయత్నిస్తూనే ఉంది.