ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మళ్లీ బెదిరింపులకు దిగాడు. ఈసారి పంజాబ్ సీఎం, ఆ రాష్ట్ర డీజీపీలను చంపేస్తామనిహెచ్చరికలు చేశాడు. ఈ నెల 26 రిపబ్లిక్ డే రోజున వారిని చంపేందుకు కలిసి రావాలని పంజాబ్‌లోని గ్యాంగ్ స్టర్లకు పిలుపునిచ్చాడు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, డీజీపీ గౌరవ్ యాదవ్‌లను హత్య చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ బెదిరింపులపై పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ స్పందించారు. పంజాబ్‌లోని గ్యాంగ్‌స్టర్లపై.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం, వారిని ఉక్కు పాదంతో అణిచివేస్తుండడంతోనే.. గురుపత్వంత్ సింగ్ పన్నూ ఈ బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ బెదిరింపులను పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తిప్పికొట్టారు. పంజాబ్‌లోని గ్యాంగ్‌స్టర్ల పట్ల రాష్ట్ర పోలీసు యంత్రాంగం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తోందని తెలిపారు. గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని గౌరవ్ యాదవ్ చెప్పారు.
అయితే గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇలా బెదిరింపులకు పాల్పడటం ఇదేమీ మొదటి సారి కాదు. కొన్ని రోజుల క్రితం భారత్‌కు చెందిన పలువురు నేతలను చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు. దేశంలోని ప్రముఖ ఆలయాలు, ఎయిర్‌పోర్ట్‌లను ధ్వంసం చేస్తామని బెదిరించాడు. గత నెలలో కూడా ఢిల్లీలోని పార్లమెంట్ భవనంపై దాడి చేస్తామని హెచ్చరించాడు. ఇప్పుడు తాజాగా పంజాబ్ సీఎంను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. భారత్‌లో దాడులు చేస్తామంటూ ఇటీవల తరచూ గురు పత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులకు దిగుతున్నాడు. వీటిని తీవ్రంగా పరిగణిస్తోన్న కేంద్రం.. ఎప్పటికప్పుడు భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. కాగా సిఖ్స్ ఫర్ జస్టిస్ వేర్పాటువాద సంస్థను భారత్ 2019 లోనే నిషేధించింది. 2007లో ఈ సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థను స్థాపించిన వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ సింగ్ పన్నూ కూడా ఒకడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది.