పుణేకి చెందిన పరాగ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో గల భాగ్యలక్ష్మి డైరీ సోమవారం టీటీడీకి రూ.22 లక్షలు విలువైన 1000 కేజీల ఆర్గానిక్ నెయ్యిని విరాళంగా అందించింది. ఆ సంస్థ ఛైర్మన్ శ్రీ దేవేందర్ షా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అక్షాలీషా తరఫున పలమనేరులోని భాగ్యలక్ష్మి డైరీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సంజయ్ నక్రా బృందం ఈ విరాళాన్ని అందజేశారు. ఈ నెయ్యిని ఉగ్రాణంలో పడిపోటు సూపరింటెండెంట్ శ్రీ కృష్ణమూర్తికి అందజేశారు.
సుప్రభాత సేవ ప్రారంభం..
పవిత్రమైన ధనుర్మాసం ముగియడంతో సోమవారం నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభమయ్యయి. గతేడాది డిసెంబరు 17వ తేదీ తెల్లవారుజామున నుంచి ధనుర్మాస ఘడియలు ప్రారంభమయ్యాయి. దీంతో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతం సేవల స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు ముగియడంతో తిరిగి జనవరి 15వ తేదీ నుంచి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవలు ప్రారంభించారు.
ఇక సంక్రాంతి, కనుమ పండగను పురస్కరించుకొని నేడు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ శాలలో గోపూజ ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం వేణుగానం, దాసాహిత్య ప్రాజెక్ట్ కళాకారులతో కోలాటం, వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో భక్తి సంకీర్తనల ఆలాపన జరగనున్నాయి. అందు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో హారతి, గోపూజ, గొబ్బెమ్మ వేడుక, తులసీ పూజ, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ నిర్వహణ వంటివి ఉన్నాయని టీటీడీ అధికారులు తెలిపారు. తర్వాత హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సంక్రాంతి హరిదాసులు, బసవన్నల నృత్యాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.