సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో అంగన్వాడీలు తమ ఆందోళనను ఉధృతం చేశారు. గత కొన్ని రోజులుగా అంగన్వాడీలు నిరసనలు, ధర్నాలు, నిరవధిక దీక్షలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నేటితో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 39వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీల నిరసనకు అనేక మంది మద్దతు తెలిపారు. తాజాగా అంగన్వాడీల సమ్మెకు అంగన్వాడీ యూనియన్ అఖిలభారత కార్యదర్శి, కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరలక్ష్మి మద్దతు తెలిపారు. శుక్రవారం కర్ణాటక సీఎస్ వరలక్ష్మి విజయవాడ ధర్నా చౌక్ వద్దకు చేరుకుని అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కర్ణాటక సీఎస్ మాట్లాడుతూ.. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమిళనాడులో అంగన్వాడీలకు 24 వేల రూపాయల కనీస వేతనం ఇస్తున్నారని, కర్ణాటకలో కూడా అంగన్వాడీలకు కనీస వేతనం 24 వేల రూపాయలు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. కేరళలో అంగన్వాడీలకు రూ.14000 కనీస వేతనం ఇస్తున్నారని... ఆంధ్రాలో ఎందుకని అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అంగన్వాడీలు చేసేది న్యాయమైన పోరాటమని.. వారు పడుతున్న కష్టానికి తగిన ఫలితం మాత్రమే ఆశిస్తున్నారని అన్నారు. ఇప్పటికే అంగన్వాడీలు నిరవధిక నిరాహార దీక్షలను చేస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని కర్ణాటక సీఎస్ వరలక్ష్మి హెచ్చరించారు.