వెంకటగిరి ‘‘రా..కదలిరా’’ బహిరంగ సభలో వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రాజకీయం మారుతుందని... ఏపీని రివర్స్ గేర్ లో నడిపించిన తుగ్లక్ పని అయిపోయిందని వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఉండి, జగన్ పాలన బాగాలేదని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చెప్పారని.. అప్పటి నుంచి ఆనంని ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూశామన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా ఆనం పనిచేశారన్నారు. ప్రజల కోసం ప్రశ్నిస్తే దూరంపెట్టి పక్కన పెట్టారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ఐదేళ్లు పోరాటం చేశారన్నారు. శిషుపాలుడు వంద తప్పులు చేస్తే, ఈ సైకో వెయ్యి తప్పులు చేశారని విమర్శించారు. ‘‘మీ అందరి చేతుల్లో ఓటుంది. ఇంటి పెద్ద సరిలేకుంటే, ఆ కుటుంబం బాగుంటుందా? ఏపీలో కూడా అదే జరిగింది. విధ్వంసం కొనసాగింది. సంక్రాంతి పండుగ కూడా చేసుకోలేకపోయాం. ఉద్యోగులకి జీతాలు పెంచే పరిస్థితి లేదు. అడిగితే జైలుకి పోతామనే భయం’’ అందరిలో ఉందని టీడీపీ అధినేత పేర్కొన్నారు.