ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలోనే ధనిక ఫ్యామిలీ.. 700 కార్లు, రూ.4 వేల కోట్ల ఇల్లు, 8 విమానాలు

international |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2024, 10:50 PM

దుబాయ్‌కి చెందిన అల్ న‌హ్‌య‌న్ రాజ కుటుంబం ప్ర‌పంచంలోనే ధ‌నిక కుటుంబం. దుబాయ్ అంటే చెప్పుకోవాల్సింది ఆయిల్ నిల్వలే. ఇక ఈ అల్ నహ్‌యన్ కుటుంబానికి ప్రపంచంలో ఉన్న మొత్తం ఇంధన నిల్వల్లో 6 శాతం వారి వద్దే ఉన్నాయి. ఇక ఆ కుటుంబానికి పెద్ద యూఏఈ అధ్య‌క్షుడు షేక్ మ‌హ్మ‌ద్ బిన్ జాయెద్ ఉన్నారు. ఈ మ‌హ్మ‌ద్ బిన్ జాయెద్‌ను ఎంబీజెడ్ అని కూడా పిలుస్తారు. ఇక వీరికి ఉన్న ఆస్తులు లెక్కించాలంటే కష్టమే. వ్యాపారాలు, ఆస్తులు, షేర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది.


 ఇక ఆ మహ్మద్ బిన్ జాయెద్ కుటుంబం అబుదాబిలో ఉన్న కాస‌ర్ అల్ వ‌త‌న్ ప్రెసిడెన్షియ‌ల్ ప్యాలెస్‌లో నివ‌సిస్తోంది. వారి వ‌ద్ద ఉన్న అత్యంత పెద్ద భ‌వంతి అదే కావడం విశేషం. సుమారు 94 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించిన ఆ భవంతి ఖరీదు రూ.4078 కోట్లు. అతిపెద్ద డోమ్ ఉన్న ఆ ఇంట్లో సుమారు 3.5 ల‌క్ష‌ల క్రిస్ట‌ల్స్‌తో చేసిన చాండ్లియ‌ర్ ఉంది. ఇక ఆ కుటుంబం వద్ద 700 ఖరీదైన కార్లు ఉన్నాయి. అందులో 5 బుగాటి వేరియంట్లు, లాంబోర్గిని రివెంట‌న్‌, మెర్సిడీజ్ బెంజ్ సీఎల్‌కే జీటీఆర్, ఫెరారి 599ఎక్స్ఎక్స్, మెక్‌లారెన్ ఎంసీ12 లాంటి అత్యంత లగ్జరీ కార్లు వారి వద్ద ఉన్నాయి. వీటితోపాటు 8 ప్రైవేటు విమానాలు కూడా ఉన్నాయి.


ఇక ఆ కుటుంబానికి దేశ, విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఫుట్‌బాల్ క్ల‌బ్‌ అయిన మాంచెస్టర్ ఫుట్‌బాల్ క్లబ్‌లో వాటా కూడా ఉంది. మాంచెస్ట‌ర్ సిటీ ఫుట్‌బాల్ జ‌ట్టులో రూ.2122 కోట్ల‌ వాటా ఈ కుటుంబానికి ఉంది. ప్ర‌పంచంలో ఉన్న ఇంధ‌న నిల్వ‌ల్లో 6 శాతం ఆయిల్ రిజ‌ర్వ్స్.. మహ్మద్ బిన్ జాయెద్ కుటుంబానికి ఉన్నాయి. వీటితోపాటు ఎన్నో ఫేమ‌స్ కంపెనీల్లోనూ ఆ కుటుంబానికి షేర్ ఉంది. పాప్ సింగ‌ర్ రిహ‌న్నా బ్యూటీ బ్రాండ్ ఫెంటీ, ఎల‌న్ మ‌స్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌లోనూ అల్ నహ్‌య‌న్ కుటుంబానికి వాటాలు ఉన్న‌ాయి.


ఇక ఆ కుటుంబం కూడా చాలా పెద్దదే. యూఏఈ అధ్య‌క్షుడు షేక్ మ‌హ‌్మద్ బిన్ జాయెద్‌కు 18 మంది సోద‌రులు, 11 మంది సోదరీమణులు ఉన్నారు. ఎమిరేట్స్‌కు చెందిన ఆ రాచ కుటుంబ పెద్ద‌కు 9 మంది పిల్ల‌లు, 18 మంది మ‌న‌వళ్లు, మ‌న‌వరాళ్లు ఉన్నారు. దుబాయ్ రాజ కుటుంబీకులకు పారిస్, లండ‌న్‌లలో ఆస్తులు ఉన్నాయి. లండ‌న్ భూస్వామి అన్న నిక్‌నేమ్ కూడా ఆ కుటుంబానికి ఉంది. బ్రిటీష్ రాజ కుటుంబం వ‌ద్ద ఉన్నంత ఆస్తి.. దుబాయ్ రాజ కుటుంబం వ‌ద్ద ఉన్న‌ట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa