సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకోగా, స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఏర్పాటుతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా కీర్తిని మూటగట్టుకుంది. సామాజిక న్యాయ మహా శిల్పాన్ని జాతికి అంకితం చేసే మహత్తర కార్యక్రమం దిగ్విజయం అయ్యింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఈ వేడుకకు తరలివచ్చారు.మధ్యాహ్నానికి అశేష ప్రజావాహినితో స్వరాజ్ మైదానానికి వచ్చే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. సభా ప్రాంగణం జనంతో నిండిపోవడంతో స్వరాజ్ మైదానానికి ఆనుకుని ఉన్న మహాత్మా గాంధీ రోడ్డు, నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ స్క్రీన్ల వద్ద జనం భారీగా గుమిగూడి ఆ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో జై భీమ్ నినాదాలు మిన్నంటాయి.