విజయవాడ నగరం నడిబొడ్డున భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. అనంతరం బౌద్ధ వాస్తు శిల్పకళతో నిర్మించిన కాలచక్ర మహా మండపాన్ని ప్రారంభించారు. అంబేడ్కర్ విగ్రహ పీఠం వద్ద ఆ మహనీయుని పాదాలపై పూలు చల్లి నివాళులర్పించారు. అంబేడ్కర్ జీవిత విశేషాలను ప్రదర్శించే విహార యాంఫీ థియేటర్‌ను ప్రారంభించారు. 18.81 ఎకరాల స్వరాజ్ మైదానంలో రూ.404 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన స్మృతివనం అంతా కలియతిరిగారు. జీవ కళ ఉట్టిపడే మైనపు విగ్రహాలు, అంబేడ్కర్ జీవిత విశేషాలు తెలియజేసే ఎక్స్‌పీరియన్స్ సెంటర్, 2 వేల మంది కూర్చొనేలా తీర్చిదిద్దిన కన్వెన్షన్ సెంటర్, 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుడ్ కోర్టు, చిన్నారులు ఆడుకోవటానికి ప్లే ఏరియా, వాటర్, మ్యూజికల్ ఫౌంటెన్లు, ఉదయం, సాయంకాలం వేళల్లో వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ మార్గాలను పరిశీలించారు.దేశానికే తలమానికంగా 81 అడుగుల పీఠంతో కలిపి 206 అడుగుల పొడవుతో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ నేపథ్యంలో ఆ మహనీయుని ఆశయాలు స్ఫూర్తిగా జగనన్న పాలన సాగుతోందంటూ వందల సంఖ్యలో డ్రోన్లతో నిర్వహించిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంబేడ్కర్ చిత్రం, నవరత్న పథకాలు, పీపుల్స్ లీడర్ సీఎం వైఎస్ జగన్, భారత పార్లమెంట్, భారతదేశ పటం, ఆంధ్రప్రదేశ్ మ్యాప్, కర్నూలు కొండారెడ్డి బురుజు, ప్రకాశం బ్యారేజ్, చిలుక, కూచిపూడి నృత్యం వంటి ఆకృతులతో డ్రోన్ల ప్రదర్శన ఆకాశంలో కనువిందు చేసింది. 14 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవు గల జాతీయ పక్షి నెమలి ఆకృతి విశేషంగా ఆకట్టుకుంది. మిరుమిట్లు గొలిపే లేజర్ షో, బాణా సంచా వెలుగులు సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. అనంతరం అంబేడ్కర్ మహాశిల్పం ముందు సీఎం జగన్‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు ఫొటోలు దిగారు. ఈ మహోత్సవంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషెన్‌రాజు, ఉప ముఖ్యమంత్రులు కొట్టు సత్యనారాయణ, అంజద్ బాషా, పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, కె. నారాయణస్వామి, మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్, ఆర్‌కె రోజా, విడదల రజని, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, ఆదిమూలపు సురేష్, ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, గురుమూర్తి, నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పుప్పాల హారిక, ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం.విక్టర్ ప్రసాద్, ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకర్రావు, సీఎస్ కెఎస్ జవహర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.