ప్రముఖ భారతీయ వంటకాలు బటర్ చికెన్, దాల్ మఖానీ ఆవిష్కరణ హక్కుల కోసం రెండు రెస్టారెంట్లు ఢిల్లీ హైకోర్టులో న్యాయపోరాటానికి దిగాయి. ఈ వంటకాలను ఆవిష్కరించింది మేమేనంటూ మోతీ మహల్, దర్యాగంజ్ రెస్టారెంట్లు పోటీపడుతున్నాయి. ‘ఇన్వెంటర్స్ ఆఫ్ బటర్ చికెన్ అండ్ దాల్ మఖానీ’ అనే ట్యాగ్‌లైన్ వివాదం కోర్టు ముందుకొచ్చింది. తమ రెండు సంస్థల మధ్య సంబంధాన్ని సూచిస్తూ దర్యాగంజ్ రెస్టారెంట్ యజమాన్యం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మోతి మహల్ తన పిటిషన్‌లో ఆరోపించింది.
బార్ అండ్ బెంచ్ ప్రకారం.. మోతీ మహల్‌తో దర్యాగంజ్ తప్పుడు అనుబంధాన్ని సృష్టించిందని దావా వాదిస్తోంది. ఈ రెస్టారెంట్ మొదటి శాఖ దర్యాగంజ్‌లో ఏర్పాటు చేశారు. ఈ కేసును విచారించిన జస్టిస్ సంజీవ్ నరులా.. దర్యాగంజ్ రెస్టారెంట్ యజమాన్యం ఒక నెలలోగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరారు. కాగా, ఈ రెండు రెస్టారెంట్లు బటర్ చికెన్, దాల్ మఖానీని కనిపెట్టినట్లు కొన్నాళ్లుగా ప్రచారం చేస్తున్నాయి.
తమ గ్రూప్ వ్యవస్థాపకుడు, పాకశాస్త్ర నిపుణుడు కుందల్ లాల్ గుజ్రాల్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయ వంటకాలు పర్యాయపదంగా మారాయని మోతీ మహల్ వాదిస్తుంది. అయితే, వీటిని దర్యాగంజ్ తోసిపుచ్చింది. కుందల్ లాల్ జగ్గీ కనిపెట్టిన వంటకాలని.. మోతీ మహల్ దావా నిరాధారమైంది అని ఖండించింది. దర్యాగంజ్ తరపు న్యాయవాది వాదిస్తూ.. మోతీ మహల్‌కు చెందిన గుజ్రాల్.. దర్యాగంజ్‌కు చెందిన జగ్గీలు పాకిస్థాన్‌లోని పెషావర్‌లో సంయుక్తంగా రెస్టారెంట్లు ఏర్పాటుచేసి ఈ వంటకాలను పరిచయం చేశారని వాదించారు. ఇరువురి వాదనలను విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను మే 29కు వాయిదా వేసింది. అప్పటి వరకు బటర్ చికెన్, దాల్ మఖానీ ఆవిష్కర్త ఎవరు అనేదానిపై తీవ్ర చర్చ కొనసాగుతుంది.