రేపు అయోధ్యలో జరిగే రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ వేడుకకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లు అయోధ్యకు వెళ్తున్నారు. ఆదివారంజు మధ్యాహ్నం ఇరువురూ అయోధ్యకు బయలుదేరుతారు. ఇవాళ రాత్రికి అక్కడే బస చేసి.. సోమవారం రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు. ఇద్దరు నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతుండడంతో బీజేపీతో పొత్తులపై రాజకీయ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.
మరోవైపు, ఈ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా? లేదా? అనేది స్పష్టత లేదు. దీనిపై సీఎం కార్యాలయం నుంచి గానీ, పార్టీ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. రామమందిర ప్రతిష్ఠ మహోత్సవానికి దాదాపు 8 వేల మంది అతిథులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. వీరిలో సినీ తారలు, రాజకీయ నాయకులు, పీఠాధిపతులు, సాధువులు ఉన్నారు. వీరిలో కొందరు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. అయితే, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటామని ప్రకటించారు.
ఈ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని 11 రోజుల దీక్షను జనవరి 11న స్వీకరించారు. కఠిక నేలపై నిద్రపోతూ.. కొబ్బరి నీళ్లనే ఆహారంగా తీసుకుంటున్నారు ప్రధాని మోదీ. జనవరి 16 నుంచే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనవరి 23న భక్తులను దర్శనాలకు ఆహ్వానించనున్నారు. కానీ, 26 వరకూ భక్తులు ఎవరూ అయోధ్యకు రావద్దని, వారికి తగిన ఏర్పాట్లను చేయలేమని ఆలయ ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. మరోవైపు, అయోధ్యలో రేపు శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకొని రాష్ట్రంలోని పలుచోట్ల శోభాయాత్రలను నిర్వహిస్తున్నారు. వేల మంది భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమంలో కోలాటాలు, నృత్యాలు, చెక్కభజన, డప్పు వాయిద్యాలతో కన్నుల పండుగగా సాగనుంది.