ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామమందిర ప్రతిష్ఠ.. బ్రిటన్ మీదుగా పీఓకే నుంచి పవిత్ర జలాలు పంపిన ముస్లిం

national |  Suryaa Desk  | Published : Sun, Jan 21, 2024, 11:20 PM

హిందువుల దశాబ్దాల కల అయోధ్యలోని భవ్యమైన రామమందిర నిర్మాణం ఎట్టకేలకు నెరవేరింది. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ దైవ కార్యానికి రామభక్తులు అరుదైన కానుకలను అందజేస్తున్నారు. కేవలం హిందువులే కాదు.. ఇతర మతాలకు చెందినవారు కూడా రాముడిపై తన ప్రేమను చాటుకుంటున్నారు. తాజాగా, పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ఓ ముస్లిం.. పవిత్ర జలాన్ని సేకరించి అయోధ్యకు పంపాడు. పీఓకే నుంచి భారత్‌కు పోస్టల్ సేవలు నిలిచిపోవడంతో ఈ జలాన్ని బ్రిటన్ మీదుగా భారత్‌కు పంపాడు.


పీఓకేలోని శారదా పీఠం వద్ద శారదా కుండ్ నుంచి ఆ ముస్లిం భక్తుడు జలాన్ని సేకరించి పంపినట్టు సేవ్ శారద కమిటీ కశ్మీర్ (SSCK) వ్యవస్థాపకుడు రవీంద్ర పండిట్ వెల్లడించారు. 2019లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిపిన బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత భారత్, పీఓకేల మధ్య పోస్టల్ సర్వీసులను నిలిపివేయడంతో అతడు యూకే మీదుగా పంపినట్టు వెల్లడించారు. అయోధ్య రామమందిర ప్రతిష్ఠ కోసం ఈ జలంతో పాటు జమ్మూ కశ్మీర్‌లోని పలు నదుల నుంచి సేకరించిన జలాలను సేవ్ శారద కమిటీ సభ్యుడు మంజునాథ్ శర్మ అందజేశారని చెప్పారు. మూడేళ్ల కిందట జరిగిన శంకుస్జాపనకు కూడా పవిత్ర జలాలు, మట్టిని పంపామని తెలిపారు.


పీఓకేలోని శారదా పీఠం వద్ద కుండ్ నుంచి పవిత్ర జలాలను తన్వీర్ అహ్మద్ అతడి బృందం సేకరించిందని రవీంద్ర పండిట్ వెల్లడించారు. ‘నియంత్రణ రేఖ వెంబడి ఉన్న మా సివిల్ సొసైటీ సభ్యుడు దానిని ఇస్లామాబాద్‌కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి లండన్‌లో ఉన్న తన కుమార్తె మగ్రిబీకి పంపారు. ఈ జలాలను ఆమె గతేడాది ఆగస్టులో అహ్మదాబాద్‌కు వచ్చిన కశ్మీర్ పండిట్ ఉద్యమకారుడు సోనాల్ షేర్‌కు అందజేశారు.. ఆయన వాటిని ఢిల్లీకి తీసుకొచ్చి తనకు అప్పగించారు’ అని అన్నారు. భారత్, పాక్ మధ్య పోస్టల్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయడంతో ఈ పవిత్ర జలాలు ఐరోపా మీదుగా ఉప-ఖండానికి రావడం జరిగిందన్నారు. కాగా, దేశ విభజన తర్వాత పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న శారదా సర్వజ్ఞ పీఠం 1948 నుంచి అందుబాటులో లేదు. కానీ, ఎస్ఎస్సీకే నియంత్రణ రేఖ వెంబడి పౌర సమాజాన్ని ఏర్పాటు చేసింది. ‘వాళ్లు మాకు మట్టి, శిలలు, ఇప్పుడు కుండ్ నుంచి పవిత్ర జలం పంపారు. జనవరి 22, 2024న రామమందిర ప్రాణ ప్రతిష్ఠలో అదే ఉపయోగించడం గర్వించదగిన విషయం. గతేడాది జూన్‌ 5 న శృంగేరి శంక్రాచార్యులు శారదా ఆలయ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఇది రెండో ప్రధాన కార్యక్రమం’ అని పండిట్ చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com