5 శతాబ్దాల తర్వాత అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుంది. అయోధ్య రాముడి ఆలయాన్ని ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించారు. వెయ్యేళ్లకుపైగా చెక్కుచెదరకుండా ఉండేలా, శక్తివంతమైన భూకంపాలను సైతం తట్టుకునేలా ఆలయాన్ని కట్టారు. వీటితోపాటు ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. ప్రతీ సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఒక అద్భుతం చోటు చేసుకోనుంది. గర్భగుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం నుదిటిపై సూర్యూడి కిరాణాలు ప్రసరించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. కోట్లాది మంది హిందువుల కల సాకారమవుతున్న వేళ అయోధ్య మందిరంలో ఏర్పాటు చేస్తున్న సూర్య తిలకం విశిష్టతలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
రామాలయ నిర్మాణంలో భాగంగా ఏటా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యలో మహా అద్భుతం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు మొదలు కానున్న ఈ ప్రక్రియ 6 నిమిషాల పాటు కొనసాగనుంది. ఈ 6 నిమిషాల పాటు గర్భగుడిలోని శ్రీరాముడి విగ్రహ నుదుటిపై సూర్య కిరణాలు ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీన్నే రాముడికి సూర్య తిలకంగా ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రత్యేక టెక్నాలజీని సీఎస్‌ఐఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ -సీబీఆర్ఐ రూపొందించింది. దాని కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్-ఐఐఏ సహాయం తీసుకుంది. ఇక దీనికి కావాల్సిన వస్తువులను బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆప్టిక్స్ సంస్థ తయారు చేసి ఇచ్చింది.
సూర్యుడి కిరణాలు రాముడి నుదిటిపై ప్రసరించేలా ప్రత్యేకంగా కటకాలు, అద్దాలు, గేర్‌బాక్స్‌లు, గొట్టాలను అయోధ్య రామాలయంలో ఏర్పాటు చేశారు. మూడో అంతస్తు నుంచి సూర్యకిరణాలు గర్భగుడిలోని విగ్రహం వరకు ప్రసరించేలా ఈ పరికరాలను అమర్చారు. చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఏటా శ్రీరామనవమిని నిర్ణయిస్తారు. కానీ సూర్యుడి భ్రమణం మాత్రం వేరుగా ఉంటుంది. అంటే ఏటా శ్రీరామనవమి రోజు ఒకే రకంగా సూర్యకిరణాలు ప్రసరించవు. అయితే ఈ కారణంగా రాముడి విగ్రహ నుదిటిపై సూర్యతిలక స్థానం మారడం అనేది ఈ సూర్య తిలకం రూపకల్పనలో సమస్యగా తలెత్తింది.
అయితే దీనికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్-ఐఐఏ సరికొత్త పరిష్కారాన్ని అందించింది. సూర్య, చంద్రరాశుల తిథులు 19 ఏళ్లకు ఒకసారి కలుస్తాయి. వాటిని ఆధారంగా చేసుకుని శ్రీరామనవమి రోజు సూర్యుడి గమనంలో వచ్చే మార్పులకు అనుగుణంగా కటకాలు, అద్దాలను గేర్‌బాక్స్‌లను అమర్చనున్నారు. దాని కోసం ఏకంగా 19 గేర్‌బాక్స్‌లను ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కో చంద్రమాన తిథికి అనుగుణంగా సూర్య కిరణాలు ప్రతీ శ్రీరామనవమికి సరిగ్గా రాముడి నుదుటిపై ఒకే స్థానంలో పడేలా చేశారు. ఈ సూర్యతిలకం కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక వ్యవస్థలోనూ ఎలాంటి ఉక్కు, ఇనుము, బ్యాటరీలు, విద్యుత్తు వాడలేదని సీబీఆర్‌ఐ స్పష్టం చేసింది.
అయితే ప్రస్తుతం ఇది అందుబాటులోకి రాలేదని అధికారులు వెల్లడించారు. ఎందుకంటే ఇప్పుడు ఆలయం పూర్తిగా నిర్మాణం జరగలేదని.. మూడు అంతస్థులు పూర్తి అయిన తర్వాతే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సూర్య కిరణాలు మూడో అంతస్తుపై నుంచి పడాల్సి ఉన్నందున.. ఆలయ నిర్మాణం 3 అంతస్థులు పూర్తైన తర్వాతే దీన్ని ఆవిష్కరించడం సాధ్యమవుతుందని తెలిపారు.
అయితే అయోధ్య రామ మందిరంలో ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ పనులు మాత్రమే పూర్తి కాగా.. 2025 డిసెంబర్ నాటికి మొత్తం 3 అంతస్థులు పూర్తి అవుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది.