ఒక మహిళ సమాజాన్ని, కుటుంబాన్ని ఎదురించి పురుషుడిగా మారింది. కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మహిళ.. తన ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ అనుమతి కూడా తీసుకుంది. లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని.. పురుషుడిగా మారింది. ఆ తర్వాత ఓ మహిళను వివాహం కూడా చేసుకుంది. వీరి పెళ్లి జరిగిన 4 ఏళ్ల తర్వాత ఆ దంపతులు ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఈ ప్రయాణంలో ఆమెకు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని వాటిని జయించింది.
మహారాష్ట్రకు చెందిన మహిళా కానిస్టేబుల్ లలితా సాల్వే కథ ఇది. బీద్ జిల్లా రాజేగాన్ గ్రామానికి చెందిన లలితా సాల్వే 1988 లో పుట్టింది. 2010 లో మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక అయింది. అయితే 25 ఏళ్లు వచ్చిన తర్వాత తన శరీరంలో మార్పులు రావడాన్ని లలితా సాల్వే గుర్తించింది. ఆస్పత్రికి వెళ్లి మెడికల్ టెస్ట్‌లు చేయించుకోగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
లలితా సాల్వే శరీరంలో మగవారిలో ఉండే వై క్రోమోజోమ్‌లు ఉన్నట్లు తేలింది. సాధారణంగా ఆడవారిలో రెండు ఎక్స్ క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. ఆమె జెండర్ డిస్ఫోరియాతో బాధపడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని మహిళ నుంచి పురుషుడిగా మారాలని ఆమెకు డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలోనే తాను పురుషుడిగా మారాలని లలితా సాల్వే నిర్ణయించుకుంది. అయితే ఈ విషయాన్ని బయటికి చెప్తే ఆమె పట్ల అంతా చిన్న చూపు చూశారు.
ఇక తాను లింగ మార్పిడి చేసుకోవడం వల్ల తన కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండటం కోసం 2017లో ప్రభుత్వాన్ని, బాంబే హైకోర్టును లలితా సాల్వే ఆశ్రయించింది. తాను లింగమార్పిడి సర్జరీ చేయించుకుంటానని.. అందుకోసం నెల రోజులు సెలవు కావాలని కోరింది. దీనికి బాంబే హైకోర్టుతోపాటు 2018 లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతిని ఇచ్చింది. దీంతో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. 2018 నుంచి 2020 వరకు 3 సర్జరీలు చేసుకున్న లలితా సాల్వే మొత్తానికి పురుషుడిగా మారింది. దీంతో తన పేరును లలితా సాల్వే నుంచి లలిత్ కుమార్ సాల్వేగా మార్చుకుంది.
ఆ తర్వాత 2020లో ఛత్రపతి శంభాజీనగర్‌కు (ఔరంగాబాద్) చెందిన సీమాను లలిత్ కుమార్ సాల్వే పెళ్లి చేసుకున్నాడు. అయితే వారి సంసారం బాగానే సాగడంతో పెళ్లి అయిన 4 ఏళ్ల తర్వాత ఈ నెల 15 వ తేదీన లలిత్ కుమార్ సాల్వే, సీమా దంపతులకు ఒక మగబిడ్డ జన్మించాడు. అయితే తనకు బాబు జన్మించడం పట్ల లలిత్ కుమార్ సాల్వే సంతోషం వ్యక్తం చేశాడు. స్త్రీ నుంచి పురుషుడిగా మారిన తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు తెలిపాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని చివరికి తన జెండర్ మార్చుకునట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు పుట్టిన కుమారుడికి ఆరుష్ అని పేరు పెడతామని ఆ దంపతులు వెల్లడించారు.