నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గంలో దాదాపు రూ. 2,700 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులు చేస్తూ నియోజకవర్గ చరిత్రలో చెరగని ముద్ర వేశామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. హుసేనాపురం గ్రామంలో రూ. 18.77 కోట్లతో నిర్మించిన వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల, బాలుర, బాలికల వసతి గృహాలు, గొర్రెల పెంపకందారుల శిక్షణ కేంద్రం తదితర భవనాలను ఎమ్మెల్సీ ఇషాక్ అహ్మద్, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి తదితరులతో కలసి ఆదివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. 50 ఏళ్లలో డోన్ నియోజకవర్గం నుంచి ఎన్నికై న నాయకులు చేయలేని అభివృద్ధిని తాము ఐదేళ్లలో చేసి చూపించామన్నారు. ఐదేళ్లకోసారి ఎన్నికల ముందు కంబగిరి స్వామి ఆశీస్సులు తీసుకునేందుకు వెళ్లే నాయకులు కనీసం ఆ దేవాలయానికి రోడ్డు సౌకర్యం కల్పించలేకపోయారని మంత్రి విమర్శించారు.