హిందువుల 500 ఏళ్ల నాటి కల నేటితో సాకారం అయింది. రాముడు జన్మించిన అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా మొదటి రోజు కేవలం ప్రత్యేక అతిథులకు మాత్రమే అయోధ్యలోకి ఆహ్వానం అందించారు. ఇక రేపటి నుంచి సాధారణ భక్తులకు అయోధ్య రాముడిని దర్శించుకునే భాగ్యం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే దేశం నలు మూలల నుంచి అయోధ్యకు చేరుకుని శ్రీరాముడిని తనివితీరా చూసుకునేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. వారికి డిజిటల్ పేమెంట్స్ యాప్ అయిన పేటీఎమ్ గుడ్‌న్యూస్ చెప్పింది. అయోధ్య వెళ్లేవారికి ఫ్రీగా బస్ టికెట్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
అయోధ్యకు వెళ్లేందుకు రోడ్డు, రైలు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయోధ్య రామ మందిరంలో భక్తులకు రాముడి దర్శనాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో ఇప్పటికే కొన్ని రోజుల వరకు బస్‌లు, ట్రైన్లు, విమానాల్లో టికెట్లు బుక్ అయిపోయాయి. ఈ క్రమంలోనే అయోధ్యకు వెళ్లే వారి కోసం ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. రామ జన్మభూమిని దర్శించేవారికి పేటీఎం యాజమాన్య సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఒక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం దీని కింద వెయ్యి మందికి ఉచితంగా అయోధ్యకు ప్రయాణించేందుకు బస్ టిక్కెట్ అందించనుంది.
అయితే ఈ ఆఫర్ ఇప్పటికే ప్రారంభమైంది. జనవరి 19 వ తేదీ నుంచి మొదలైన ఈ ఆఫర్ కోసం జనం భారీగా ఎగబడుతున్నారు. పేటీఎం మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే మొదటి వెయ్యి మంది ప్రయాణికులకు మాత్రమే ఈ ఉచిత బస్ టికెట్లను అందించనున్నట్లు పేటీఎం సంస్థ పేర్కొంది. అయితే ఈ ఫ్రీ బస్ టికెట్ పొందేందుకు పేటీఎం యాప్‌లో టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఆఫర్‌ను పొందడానికి 'BUSAYODHYA' అనే ప్రోమో కోడ్‌ని ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపింది.