ప్రపంచ టెక్ దిగ్గజ గూగుల్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆ కంపెనీ ఉద్యోగులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ కంపెనీ ఇటీవలే మరోసారి లేఆఫ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారు 15 వేల మందికిపైగా ఐటీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ తొలగింపులపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ తీసుకుంటున్న లేఆఫ్స్ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ జనవరి 18వ తేదీన ఆమెరికాలోని ఐదు గూగుల్ క్యాంపసుల్లో నిరసన ప్రదర్శనలు చేసింది. ఉద్యోగులను తొలగించడానికి కంపెనీ చెబుతున్న కారణాలను బోగస్గా పేర్కొంటూ ఆయా నిర్ణయాలను సవాల్ చేయడమే తమ లక్ష్యమని ఉద్యోగులు పేర్కొంటున్నట్లు బిజినెస్ ఇన్‌సైడర్ పేర్కొంది.
కంపెనీ లేఆఫ్స్‌కు వ్యతిరేకంగా పోరాటానికి దిగిన ఉద్యోగుకు ప్రాతినిధ్యం వహిస్తోంది ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్. కొద్ది రోజుల క్రితం లేఆఫ్స్ ప్రకటించడం ద్వారా 15 వేల మందిపై ప్రతికూల ప్రభావం పడినట్లు వెల్లడించింది. ఈ కారణంగానే అమెరికాలోని గూగుల్ క్యాంపసుల్లో నిరసనలు చేపట్టేందుకు ప్రేరేపించినట్లు యూనియన్ పేర్కొంది. ఈ లేఆఫ్స్ కారణంగా కాకుండా ఉన్న ఉద్యోగులపైనా తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ కమ్యూనికేషన్ విభాగం అధినేత స్టీఫెన్ మెక్‌ముర్ట్రీ. లేఆఫ్స్ అనేవి ఉద్యోగులపై పని భారాన్ని పెంచుతున్నాయని, అది ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్నట్లు పేర్కొన్నారు.
అమెరికాలోని గూగుల్ క్యాంపసుల్లో ఉద్యోగులు నిరసనలు తెలపడంపై గూగుల్ సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. కంపెనీ అతిపెద్ద ప్రాధాన్యత.. భవిష్యత్తులో కీలకమైన అంశాలలో బాధ్యాతయుతంగా పెట్టుబడి పెట్టడమేనని పేర్కొంది. సంస్థాగతంగా చేపడుతున్న మార్పులలో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని తొలగింపులు చేపట్టక తప్పడం లేదని పేర్కొంది. అలాగే ఈ లేఆఫ్స్ లో ఉద్యోగాలు కోల్పోయిన వారు కొత్త ఉద్యోగాలు పొందడానికి సహాయం చేయడానికి తాము నిబద్ధతతో ఉన్నట్లు తెలిపింది. కంపెనీలోపల, బయట కొత్త ఉద్యోగాలు సాధించేందుకు సాయపడతమాని తెలిపింది. ఉద్యోగులు నిరసనలు తెలుపుతున్న క్రమంలో గూగుల్‌లోని ఇంజనీరింగ్ మేనేజర్ కెన్నెత్ స్మిత్ ఈ తొలగింపులు నోటీసులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జనవరి10న లేఆఫ్స్ మెయిల్ అందుకున్న స్మిత్.. అంటు వంటి పరిస్థితుల్లో ఉద్యోగులతో చర్చించి మరింత మానవత్వంతో వ్యవహించాల్సిన అవసరం ఉందన్నారు.