ఆధార్ ఎన్‌రోల్మెంట్, అప్డేట్ రూల్స్ మారుస్తూ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ మేరకు జనవరి 18, 2024వ తేదీన సర్క్యూలర్ జారీ చేసింది. ఇందులో దేశ పౌరులు, ఎన్ఆర్ఐలు, విదేశీ పౌరుల కోసం ఆధార్ ఎన్‌రోల్మెంట్, అప్డేట్స్ కోసం కొత్త ఫామ్‌ని నోటిఫై చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఇక ఈజీగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫామ్ ఉపయోగించి 18 ఏళ్లు నిండిన తర్వాత ఆధార్ నంబర్ ని రద్దు చేసుకునే వీలు కల్పిస్తోంది యూఐడీఏఐ. అయితే, కార్డు రద్దు ఎందుకు చేసుకోవాలో కొన్ని సందర్భాలు సూచించింది. కొత్త రూల్స్ ప్రకారం.. ఆధార్ కార్డు ఉన్నవారు 18 ఏళ్లు నిండిన తర్వాత కార్డు రద్దు చేసుకోవచ్చు. అందుకు కొత్త ఫారమ్.. ఫామ్-9 అందుబాటులోకి తీసుకొచ్చింది యూఐడీఏఐ. ఆధార్ కార్డుదారుడు తనకు 18 ఏళ్ల వయసు నిండిన తర్వాత తన కార్డును రద్దు చేసుకునేందుకు వీలుకల్పిస్తోంది ఈ కొత్త ఫామ్. అయితే ఆధార్ ఎన్‌రోల్మెంట్ అండ్ అప్డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం.. ఆధార్ నంబర్ ఎప్పుడు క్యాన్సెల్ చేస్తారో తెలుసుకుందాం.
ఒకే వ్యక్తికి రెండు ఆధార్లు ఉన్నప్పుడు..
ఒకే వ్యక్తికి రెండు ఆధార్ నంబర్లు కేటాయించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వారు తమ ఒక ఆధార్ నంబర్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. కొత్తగా జారీ చేసిన నంబర్ అట్టిపెట్టుకుని మిగిలిన వాటిని రద్దు చేసుకోవచ్చు.
ఫోటోపై ఫోటో వచ్చినప్పుడు..
ఫోటో పై ఫోటో వచ్చిన సందర్భంలో అలాగే బయోమెట్రిక్ సమచారం అందుబాటులో లేనప్పుడు రద్దు చేసుకోవచ్చు. చాలా సందర్భాల్లో కొత్త ఫోటో గ్రాఫ్ తీసుకోకుండానే పాత ఫోటోను వినియోగించడం, బయోమెట్రిక్ సమాచారం లేకుండానే ఆధార్ నమోదు చేసిన సందర్భంలో తమ ఆధార్ కార్డును రద్దు చేసుకోవచ్చు. అలాగే తప్పుడు బయోమెట్రిక్ వివరాలు సమర్పించినప్పుడు సైతం కార్డును క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలాగే బయోమెట్రిక్ వివరాలు ఇవ్వకూడదని పెద్ద వారిని 5 ఏళ్లలోపు పిల్లలుగా ఎన్‌రోల్ చేసిన సందర్భంలోనూ ఆధార్ కార్డును రద్దు చేయవచ్చు. ఆధార్ రెగ్యులేషన్స్ షెడ్యూల్ VI (27)(C)ప్రకారం ప్రాంతీయ అధికారికి తమ కార్డును రద్దు చేయమని కోరవచ్చు. 18 ఏళ్లు నిండిన ఆరు నెలల్లోపు ప్రాంతీయ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూడు నెలల్లో కార్డు రద్దు చేస్తారు.
ఆధార్ డీయాక్టివేట్..
ఆధార్ నంబర్ డియాక్టివేట్ చేసేందుకు కొన్ని కారణాలను తెలిపింది యూఐడీఏఐ. అందులో ఫోటోపై ఫోటో రావడం, బయోమెట్రిక్ వివరాలు లేకపోడవం, తప్పుడు బయోమెట్రిక్ వివరాలు సమర్పించినప్పుడు ఆధార్ డియాక్టివేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే సరైన డాక్యుమెంట్లు సమర్పించకుండానే ఆధార్ జారీ చేసినప్పుడు ఆ నంబర్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సరైన పత్రాలు సమర్పించే వరకు డీయాక్టివేట్ స్టేజ్ లోనే ఉండొచ్చు. ఆధార్ కార్డుదారుడికి 5 లేదా 15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు కార్డు అప్డేడ్ చేయాలి. ఆ సమయంలో బయోమెట్రిక్ తప్పనిసరిగా నమోదు చేయాలని లేదంటే డియాక్టివేట్ అవుతుంది. రెండేళ్లలోపు ఈ పని పూర్తి చేయాల్సి ఉంటుంది.