చిత్తూరు నగరం శంకరయ్యగుంటలో బుధవారం రాత్రి జరిగిన దాడిలో హురాన్, సల్మా గాయపడ్డారు. టూటౌన్ సీఐ ఉలసప్ప తెలిపిన ప్రకారం.. నూర్ అనే వ్యక్తి ఓ చికెన్ షాపులో పని చేస్తూ తన భార్య హసీనాతో కలిసి శంకరయ్యగుంటలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి తనను భర్త కొడుతున్నాడంటూ హసీనా తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో హసీనా తల్లి, ఆమె పెద్ద కుమార్తె సల్మా వెళ్లి ఇద్దరిని విడిపించే ప్రయత్నం చేశారు. తన కుటుంబంలో గొడవ జరుగుతుంటే ఎందుకు అడ్డు వస్తున్నారంటూ ఆగ్రహించిన నూర్ కత్తి తీసుకుని అత్త, వదినపై దాడికి పాల్పడ్డాడు. వారిద్దరి గొంతు వద్ద తెగడంతో స్థానికులు చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు కోలుకుంటుండగా... సల్మా హోంగార్డుగా పనిచేస్తున్నారు. టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.