రానున్న ఎన్నికల్లో తిరుపతి జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశం ఉదయం 11:30 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు సుదీర్ఘంగా సాగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల నాయకులు ముఖ్యమంత్రి గారు ఎంపిక చేసిన అభ్యర్ధి గెలుపు కోసం పని చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ..... నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి పోటి చేస్తారని చెప్పారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేసిందని చెప్పారు. అలాగే పెడింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించేందుకు అధికారులతో తాను మాట్లాడతానని భరోసా ఇచ్చారు.గతంలో తిరుపతిలో వెంకటగిరి నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు తన ఎంపి ల్యాండ్స్ నుంచి నిధులిస్తానని హామీ ఇచ్చానని, ఈ విషయంలో స్థానిక నాయకులు ఫాలోఆప్ చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో నాయకుల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత నియోజకవర్గ సమన్వయకర్త మీద ఉందని అలాగే నాయకులందర్నీ కలుపుకుంటూ సంతృప్తి పరచాల్సిన బాధ్యత ఆయనదేనని అన్నారు. పార్టీలో నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలను అంతర్గతంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా అభ్యర్థి గెలుపు కోసం కృషి చెయాలని విజయసాయిరెడ్డి గారు కోరారు. నియోజకవర్గ పరిధిలో కలువోయ, రాపూర్, సైదాపురం, డక్కిలి, వెంకటగిరి గ్రామం,బాలాయపల్లె మండలాలకు చెందిన నాయకులు హాజరయ్యారు.