విశాఖపట్నం నగరంలోని ఆర్కేబీచ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఆర్కే బీచ్లో భారీ త్రివర్ణ పతాక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో ఫ్రీడమ్ కలర్ వాక్ నిర్వహించారు. అలాగే 400 మీటర్ల పొడవాటి త్రివర్ణపతాకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం పురోభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. గడిచిన తొమ్మిది ఏళ్లలో ఎన్నో అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసుకున్నామన్నారు. 11వ స్ధానంలో ఉన్న మన ఆర్ధిక వ్యవస్థను ఐదో స్ధానానికి తీసుకువచ్చారన్నారు. రానున్న కాలంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మనదేశం అవతరించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ అభివృద్దిలో అంతా భాగస్వాములం అవుదామని జీవీఎల్ నరసింహారావు పిలుపునిచ్చారు.