జనవరి 22న అయోధ్యలోని రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ముస్లిం చీఫ్‌పై ఫత్వా జారీ అయ్యింది. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసి రామమందిర వేడుక అనంతరం సాయంత్రం నుంచే ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడం జరిగింది.అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట వేడుక తర్వాత సోషల్ మీడియా వేదికగా తనకు వ్యక్తిగతంగా ఫత్వా జారీ అయిందని ఆయన తెలిపారు.
ఈ నెల 22న అయోధ్య రామమందర విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుక ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీరామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్‌గా వ్యవహరించిన ఇక్బాల్ అన్సారీతో పాటు ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్‌యాసికి కూడా రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఆహ్వన పత్రికలు అందజేసింది. అంతేకాకుండా, ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులకు రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపించింది.
ఇక, ఈ వేడుకకు ఆహ్వానం అందుకున్న ముస్లిం చీఫ్ ఉమర్ అహ్మద్ ఆహ్వానం అందిన రెండు రోజులు బాగా ఆలోచించి తాను అయోధ్యకు వెళ్లినట్లుగా వివరించారు. అయితే తాను ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు హాజరైన అనంతరం తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన స్వయంగా వివరించారు. ముఖ్యంగా ఒక వర్గం తనను తీవ్రంగా తిడుతున్నట్లు కూడా ఆయన తెలిపారు. అంతేకాకుండా, సోషల్ మీడియా వేదిక ద్వారా తనకు వ్యక్తిగతంగా ఫత్వా కూడా జారీ చేశారని ఆయన అన్నారు.