ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా పనిచేస్తున్న స్వాతి మలివాల్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ.. రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలె ఆమె రాజ్యసభకు ఎన్నిక కాగా.. తాజాగా రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బుధవారంతో ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. సమావేశాల తొలిరోజే స్వాతి మలివాల్ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభలో ఆమె రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. అయితే స్వాతి మలివాల్ రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేయడం వెనుక భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే బుధవారం స్వాతి మలివాల్ సహా మొత్తం ముగ్గురు రాజ్యసభకు ఎంపికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ఒకరు స్వాతి మలివాల్ కాగా.. మరొకరు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచే ఎన్నికైన ఆర్థిక రంగ నిపుణులు అయిన నారాయణ్ దాస్ గుప్తా.. ఇక విద్యావేత్త, చంఢీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, ఛాన్స్‌లర్ అయిన సత్నమ్ సింగ్ సంధూ కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. అయితే స్వాతి మలివాల్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్లీ చేయాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆమెకు సూచించారు.
అయితే ఎందుకు రెండోసారి స్వాతి మలివాల్‌ను ప్రమాణ స్వీకారం చేయమన్నారు అనేదే ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభకు నామినేట్ అయిన సభ్యులు చదవాల్సిన ప్రమాణ స్వీకార పత్రాన్ని పొరపాటున స్వాతి మలివాల్‌కు ఇచ్చారని.. అయితే దాన్ని గుర్తించి సరిచేసేందుకు మరోసారి ప్రమాణ స్వీకారం చేయాలని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సూచించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే దీనిపై మరో వాదన కూడా తెరపైకి వచ్చింది. స్వాతి మలివాల్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు ఇచ్చారని.. దానిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ స్వాతి మలివాల్‌ను మరోసారి ప్రమాణ స్వీకారం చేయాలని అడిగినట్లు సమాచారం.
ఇక ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన తొలి మహిళా సభ్యురాలు స్వాతి మలివాల్ కావడం గమనార్హం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు ఢిల్లీలోని కన్నాట్ ప్రాంతంలో ఉన్న హనుమాన్ ఆలయానికి స్వాతి మలివాల్ వెళ్లి.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాను గతంలో సామాజిక కార్యకర్తను అని.. క్షేత్ర స్థాయిలో మహిళల సమస్యలు, వేధింపులు సహా అన్నీ చూశానని.. వాటిని రాజ్యసభలో లేవనెత్తుతానని చెప్పారు. తాను ఎప్పటికీ సామాజిక కార్యకర్తనేనని వ్యాఖ్యానించారు. ఇవాళ తనకు చాలా ప్రత్యేకమైన రోజు అని.. తన జీవితాన్ని దేశానికి అంకితం చేస్తున్నట్లు ప్రమాణం చేసినట్లు స్వాతి మలివాల్ తెలిపారు.