గత 2, 3 రోజుల నుంచి జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈడీ అధికారులు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మధ్య దోబూచులాట కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ కేసుల్లో మనీలాండరింగ్ ఆరోపణలతో హేమంత్ సోరెన్‌ను విచారణ చేస్తున్న ఈడీ అధికారులపైనే.. ఆయన తిరిగి కేసు పెట్టడం సంచలనం అయింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనను వేధిస్తున్నారని.. హేమంత్ సోరెన్.. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను విచారించేందుకు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాంచీలోని ఆయన నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. 7 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు మధ్య హేమంత్ సోరెన్‌ను ఈడీ విచారణ జరిపింది. ఈ క్రమంలోనే వారిపై హేమంత్ సోరెన్ కేసు పెట్టడం సంచలనంగా మారింది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద ఈడీ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ధృవా పోలీస్ స్టేషన్‌లో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఫిర్యాదు చేసినట్లు రాంచీ పోలీసులు తాజాగా వెల్లడించారు.
ఇక రాంచీలోని హేమంత్ సోరెన్ నివాసానికి చేరుకున్న ఈడీ బృందాలు.. ఆయనను ప్రశ్నిస్తున్నాయి. ఇక ఈ విచారణ పూర్తి కాగానే.. హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు జార్ఖండ్ రాజకీయాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎంను అరెస్ట్ చేస్తే జార్ఖండ్‌లో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని.. భావించిన ఈడీ అధికారులు.. విచారణ సందర్భంగా భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. కేవలం రాంచీలోనే కాకుండా జార్ఖండ్ వ్యాప్తంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇక భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణ చేసేందుకు 10 రోజుల వ్యవధిలో రెండోసారి హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే హేమంత్ సోరెన్ అరెస్ట్ అవుతారనే వార్తల నేపథ్యంలో.. జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలతో ఆయన భేటీ కావడంతో జార్ఖండ్ రాజకీయాల్లో ఏదో జరగబోతోందనే సంకేతాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో తనను ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే.. జార్ఖండ్ సీఎం పదవీ బాధ్యతలను ఆయన సతీమణి కల్పనా సోరెన్‌కు అప్పగించనున్నారనే వార్తలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రాంచీలోని రాజ్‌భవన్, సీఎం నివాసం, ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు ఇప్పటికే 144 సెక్షన్ విధించారు.