ఢిల్లీ మద్యం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ.. ఐదోసారి సమన్లు జారీ చేసింది. గతంలో 4 సార్లు సమన్లు జారీ చేసినా అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాకపోవడం గమనార్హం. పైగా తనపై ఈడీ అసత్య ఆరోపణలు చేస్తోందని.. ఈ కేసు, సమన్లు అంతా రాజకీయ ప్రేరేపితం అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఐదోసారి కూడా ఈడీ సమన్లు జారీ చేయడంతో కేజ్రీవాల్ విచారణకు హాజరు అవుతారా లేక.. ఎప్పటిలాగే పట్టించుకోకుండా ఉంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఒకవేళ ఈసారి విచారణకు కేజ్రీవాల్ హాజరు కాకపోతే.. ఆయనను అరెస్ట్ చేయాలని ఈడీ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఫిబ్రవరి 2 వ తేదీన విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్‌కు జారీ చేసిన సమన్లలో ఈడీ అధికారులు పేర్కొన్నారు. అయితే ఇదే ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటికే 4 సార్లు సమన్లు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు. ఈ కేసులో తొలిసారి గతేడాది నవంబర్ 2 వ తేదీన కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత డిసెంబరు 21 వ తేదీన రెండోసారి.. ఈ నెల 3 వ తేదీన మూడోసారి, ఈ నెల 18 వ తేదీన నాలుగోసారి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు ఇచ్చింది.
ఢిల్లీ మద్యం కేసులో విచారణ జరిపేందుకు తమకు సహకరించాలని.. కేసు విచారణకు హాజరు కావాలంటూ ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయితే రకరకాల కారణాలు చూపించిన కేజ్రీవాల్ వాటిని తిరస్కరించారు. మరోవైపు.. ఈ సమన్లు రాజకీయ ప్రేరేపితం అని ఆరోపిస్తూ వాటిని పెడచెవిన పెట్టారు. ఈ సందర్భంగానే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేజ్రీవాల్.. తన జీవితంలో దాచడానికి ఏమీ లేదని.. అలాంటిది ఇలాంటి సమన్లను స్వీకరించనని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఐదోసారి కేజ్రీవాల్‌ను.. ఢిల్లీ మద్యం కేసు విచారణ జరిపేందుకు ఈడీ పిలవడం సంచలనంగా మారింది. ఈ సారి కూడా విచారణకు కేజ్రీవాల్ హాజరు కాకపోతే.. ఆయనను అరెస్టు చేసేందుకు వారెంట్ కోసం కోర్టును ఆశ్రయించాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ అధికారులు అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించారు. గతేడాది ఏప్రిల్‌లో కేజ్రీవాల్‌ను సీబీఐ 9 గంటల పాటు ప్రశ్నించింది. ఆ తర్వాత ఈడీ కూడా రంగంలోకి దిగి పలుమార్లు ఆయనకు సమన్లు అందించింది. ఇక ఇదే ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అయి జైలులో ఉన్నారు.