సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో 5 శతాబ్దాల నుంచి నలుగుతున్న అయోధ్య రామ మందిర వివాదం ముగిసింది. ఇక 2019 లో తీర్పు వెలువడగా.. తాజాగా ఇటీవలె అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకుని.. ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ క్రమంలోనే అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణి శంకర్ అయ్యర్ కుమార్తె చేసిన పని ఇప్పుడు ఆయనను ఇబ్బందుల్లో పడేసింది. అయోధ్య ప్రాణప్రతిష్ఠ సమయంలో నిరసన వ్యక్తం చేస్తూ ఆమె ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా వారు నివసిస్తున్న ఇంటిని ఖాళీ చేయాలని వారికి నోటీసులు అందడం సంచలనంగా మారింది.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం వేళ.. తాను నిరసన దీక్ష చేయనున్నట్లు మణిశంకర్ అయ్యర్ కుమార్తె సూర్య అయ్యర్.. ఈనెల 20 వ తేదీన చేసిన ఓ ఫేస్‌బుక్ పోస్ట్.. తాజా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అయితే ఈ సోషల్ మీడియా పోస్టును ఖండించిన రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్-ఆర్‌డబ్ల్యూఏ.. ఢిల్లీలోని జంగ్‌పురాలో ఉన్న ఇంటిని ఖాళీ చేయాలని మణిశంకర్ అయ్యర్, ఆయన కుమార్తె సూర్య అయ్యర్‌లకు నోటీసులు అందించింది. అయితే ఈ నోటీసులు ఎప్పుడో అందించగా.. తాజాగా వెలుగులోకి వచ్చాయి.
తోటి వారి మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా.. సమాజంలో శాంతికి భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు చేయకూడదని.. ఆ నోటీసుల్లో ఆర్‌డబ్ల్యూఏ పేర్కొంది. అయోధ్య రామ మందిరంపై సూర్య అయ్యర్ చేసిన పోస్ట్ సరైందేనని భావిస్తే.. అలాంటి విద్వేషాన్ని ఆమోదిస్తూ కళ్లు మూసుకుని ఉండే మరో కాలనీకి దయచేసి వెళ్లిపోవాలని వినమ్రంగా సూచిస్తున్నట్లు నోటీసుల్లో వెల్లడించింది. అయితే.. చదువుకున్న సూర్య అయ్యర్ ఇలాంటి పోస్టులు చేయడం తగదని తెలిపింది. 500 ఏళ్ల తర్వాత రామ మందిరాన్ని నిర్మిస్తున్నారని.. అది కూడా సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు జడ్జిలు 5-0 మెజారిటీతో తీర్పు ఇచ్చిన తర్వాతే అయోధ్యలో రామ మందిరం ఏర్పాటైందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని.. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రాన్ని దుర్వినియోగం చేయడం మంచిది కాదని పేర్కొంది.
దేశం కోసం, దేశ శ్రేయస్సు కోసం రాజకీయాల్లో ఏమైనా చేయవచ్చని.. కానీ మీరు చేసే చర్యలు.. మీరు నివసించే కాలనీకి మంచి లేదా చెడ్డ పేరు ఏది తీసుకువస్తాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని నోటీసుల్లో ఆర్‌డబ్ల్యూఏ సూచించింది. ఇకపై ఇలాంటి పోస్టులు గానీ, కామెంట్లు చేయడం మానుకోవాలని హితవు పలికింది. అయితే కుమార్తె సూర్య అయ్యర్ చేసిన పోస్టును మణి శంకర్ అయ్యర్ ఖండించాలని.. లేదా ఇల్లు వదిలి వెళ్లాలని ఆ నోటీసుల్లో ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను రెచ్చగొట్టి వారి మధ్య ద్వేషాన్ని, అపనమ్మకాన్ని సృష్టించవద్దని అసిసోయేషన్ తెలిపింది. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకకు నిరసనగా తాను నిరాహార దీక్ష చేస్తున్నట్లు జనవరి 20 వ తేదీన సూర్య అయ్యర్ చేసిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. తాను చేస్తున్న ఈ దీక్ష తోటి ముస్లింలకు ప్రేమను, అదే సమయంలో వారి బాధను వ్యక్తం చేస్తుందని సూర్య అయ్యర్ పేర్కొనడం సంచలంగా మారింది.