ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జ్ఞానవాపి కేసులో కీలక మలుపు.. మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు హిందువులకు అనుమతి

national |  Suryaa Desk  | Published : Wed, Jan 31, 2024, 09:35 PM

జ్ఞానవాపి మసీదు- మందిరం వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. మసీదు ఆవరణలో హిందువులు పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు భక్తులు పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే స్పందించిన కాశీ విశ్వనాథ్ ట్రస్ట్.. ఈ కేసులో ఇది అతిపెద్ద విజయమని పేర్కొంటూ.. వారం రోజుల్లో జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివుడికి పూజలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఇటీవలె జ్ఞానవాపి ప్రాంగణంలో సర్వే నిర్వహించిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా.. ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో ఒక భారీ హిందూ ఆలయం ఉండేదని.. దాన్ని కూల్చి వాటి శిథిలాలతో మసీదు నిర్మించారని నివేదికను వెలువరించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే తాజాగా జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆదేశాలపై హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


మసీదు ప్రాంగణంలో హిందూ దేవతల విగ్రహాలను ఏర్పాటు చేసి.. వారం రోజుల్లోనే పూజలు మొదలు పెడతామని కాశీ విశ్వనాథ్‌ ట్రస్ట్‌ సభ్యులు పేర్కొన్నారు. ఇది జ్ఞానవాపి కేసులో హిందువులకు దక్కిన అతి పెద్ద విజయమని ట్రస్ట్‌ వెల్లడించింది. జ్ఞానవాపి మసీదు లోపల మూసివున్న వ్యాస్ కా టెఖానా లోపల పూజలు చేసేందుకు హిందువులకు అనుమతులు ఇస్తూ.. వారణాసి కోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. 7 రోజుల్లో అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని వారణాసి జిల్లా అధికార యంత్రాంగానికి కోర్టు సూచించింది.


పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి


జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సీలు వేసి ఉన్న నేలమాళిగలో పూజలు చేసుకోవడానికి వారణాసి కోర్టు బుధవారం హిందూ భక్తులకు అనుమతులను మంజూరు చేసింది. వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. హిందూ భక్తులు ఇప్పుడు వారణాసిలోని జ్ఞానవాపి మసీదు లోపల మూసి ఉన్న వ్యాస్ కా టెఖానాలో ప్రార్థనలు చేయవచ్చు. అంతకుముందు రోజు విచారణ సందర్భంగా.. రాబోయే 7 రోజుల్లో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వారణాసి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.


ఈ ఆదేశాలపై హిందువుల తరపున ఈ జ్ఞానవాపి మసీదు కేసులో వాదనలు వినిపిస్తున్న లాయర్ విష్ణు శంకర్ జైన్ మీడియాతో మాట్లాడారు. వ్యాస్ కా టెఖానాలో ప్రార్థనలు చేసేందుకు హిందూ పక్షానికి అనుమతి లభించిందని.. దాని కోసం వారణాసి జిల్లా యంత్రాంగం 7 రోజుల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది.. పూజలు చేయండని విష్ణు శంకర్ జైన్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com