పాపాలన్నీ చంకలో పెట్టుకుని కాశీకి పోతే ఖర్మతెగుతాదా అని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఆయన కుటుంబం అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఎన్ని దాన ధర్మాలు చేసినా ఆయన చేసిన పాపాలు పోవన్నారు. రాచమల్లు సంపాదించిన వెయ్యికోట్ల అక్రమ సంపాదనలో చేసేదాన ధర్మాలు ఒక్కశాతం కూడా వుండవన్నారు. ప్రొద్దుటూరు చుట్టుపక్కల వున్న భూముల్లో నాలుగవ వంతు భూములు నేడు రాచమల్లు, ఆయన కుటుంబం చేతుల్లో వున్నాయన్నారు.సగరులు ,నాయీబ్రాహ్మణులు, రజకులు లాంటి కొన్నికులాల కల్యాణ మండపాలకు స్థలాలు, డబ్బులు ఇస్తుండటం ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప మరొకటి కాదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులు ఆర్థిక సంఘం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం వలన పంచాయతీలు నిర్వీర్యం అవుతున్నాయన్నారు. అంతేకాకుండా సర్పంచులకున్న అధికారాలని కాలరాయబడుతున్నాయన్నారు.