బెల్టు దుకాణాలకు మద్యం బాటిళ్లను తరలిస్తున్న నలుగురిని ఎర్రగొండపాలెం ఎస్‌ఈబీ అధికారులు బుధవారం వలపన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారం అందడంతో ఎస్‌ఈబీ సీఐ పి.నాగేశ్వరరావు తన సిబ్బందితో స్థానిక టూరిజం మద్యం దుకాణం సమీపంలో కాపుకాశారు. బైకులపై మద్యాన్ని తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 200 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారిలో గుమ్మా అంజయ్య, పులిగొర్ల నరసింహులు త్రిపురాంతకంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో సేల్స్‌మెన్లు కాగా, కోండ్రు రామారావు సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దూదేకుల మీరావలి గణపవరంలో బెల్టు దుకాణాన్ని నడుపుతున్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న నిందితులను వైపాలెం ఎస్‌ఈబీ కార్యాలయానికి తరలించి, అనంతరం కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాల్లో ఎక్కడైనా బెల్టు దుకాణాలు నిర్వహించినా, సారా తయారు చేసినా, అమ్మినా తమకు సమాచారం ఇవ్వాలని సీఐ నాగేశ్వరరావు ప్రజలను కోరారు. ఈదాడులలో ఎస్‌ఈబీ ఎస్సై వై.మోహన్, సిబ్బంది రమే్‌సబాబు, శ్రీనివాసులు పాల్గొన్నారు.