తన కుమారుడి ప్రవర్తనతో తీవ్రంగా కలతచెందిన ఓ తండ్రి అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. పోర్న్ వీడియోలు చూస్తూ, అమ్మాయల్ని టీజింగ్ చేస్తుండటంతో విసిగిపోయిన తండ్రి.. కొడుక్కి కూల్ డ్రింక్‌లో విషం కలిపి ప్రాణం తీశాడు. తన చేతులతోనే కన్నకొడుకును తండ్రి చంపుకున్న ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్‌లో గత నెలలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. సోలాపూర్‌కి చెందిన విజయ్ బట్టు దర్జీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతడి కుమారుడు విశాల్ దగ్గర్లోని పాఠశాలలో చదువుకునేవాడు. అయితే, విశాల్ కనిపించడం లేదంటూ జనవరి 13న పోలీసులకు ఫిర్యాదు అందింది.
దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. అతడికోసం గాలించడంతో బాలుడి మృతదేహం ఓ ప్రాంతంలో లభ్యమైంది. దానిని తప్పిపోయిన తమ కుమారుడు విశాల్ మృతదేహంగా కుటుంబ సభ్యులు గుర్తించారు. పోస్ట్‌మార్టం నిర్వహించగా.. విషం తాగినట్లు తేలింది. హత్య కేసు నమోదుచేసిన పోలీసులు.. కుటుంబసభ్యులను ప్రశ్నించారు. వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం బలపడింది. బాలుడి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపెట్టాడు. కొడుకును తానే చంపినట్టు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
కుమారుడి ప్రవర్తనతో విసిగిపోయిన విజయ్ బట్టు దారుణానికి పాల్పడ్డాడని చెప్పారు. స్కూల్‌లో అమ్మాయిల్ని టీజ్ చేయడం, మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలను చూడటం వంటివి చేస్తున్నాడని, తీరు మార్చుకోమని చెబితే వినిపించుకోలేదని విచారణలో బట్టు వెల్లడించాడు. అంతేకాదు, స్కూల్ నుంచి తనకు తరుచూ ఫిర్యాదులు రావడంతో విసిగిపోయానని చెప్పాడు. జనవరి 13న కొడుకును ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని తుల్జాపూర్ రోడ్డుకు తీసుకెళ్లి.. అక్కడ కూల్ డ్రింక్ కొనుగోలు చేసి విషం కలిపి ఇచ్చినట్టు అంగీకరించాడు. అది తాగిన తర్వాత స్పృహతప్పి పడిపోవడంతో అక్కడే వదిలేసి ఇంటికి వచ్చేశానని పేర్కొన్నాడు. అదే రోజు సాయంత్రం ఏమీ తెలియనట్టు భార్యతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. తమ కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కొడుకు మృతదేహం లభ్యం కావడంతో హత్య విషయం బయటపడింది.