ఆ ఊరిలో ఉన్న ఆలయం నుంచి శబ్దాలు వస్తున్నాయి. స్థానికులకు అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే రంగంలోకి దిగి ఆలయం దగ్గరకు వెళితే అసలు గుట్టు బయటపడింది. అనంతపురం జిల్లా యాడికి గుడిపాడులో కంబగిరిస్వామి ఆలయం ఉంది. అక్కడ సమీపంలో గుప్త నిధులు ఉన్నాయంటూ ఓ ముఠా రంగంలోకి దిగింది. ఈ ముఠాలో కీలక సూత్రధారి చింతకాయల శివగంగరాజు.. తన సమీప బంధువులైన మరో ఎనిమిది మందితో గుప్తనిధుల కోసం గుడి దగ్గర తవ్వకాలు మొదలుపెట్టాడు.
దాదాపు 8 అడుగుల లోతు భారీ గుంత తవ్వగా.. నిధులు బయటపడలేదు. అయితే ఆలయం వైపు నుంచి శబ్దాలు వస్తుండటాన్నిస్థానికులు గమనించారు.. వారు వెంటనే గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు పక్కా ప్రణాళికతో తవ్వకాలు జరుపుతున్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మూఢనమ్మకాలతో గుప్తనిధుల తవ్వకాల సూత్రధారి చింతకాయల శివగంగరాజు తన సమీప బంధువులతో ఓ ముఠాగా ఏర్పడి గుప్తనిధుల కోసం వేట ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తవ్వకాలకు ఉపయోగించిన సామాగ్రిని, బైక్‌లు, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. Cr.No.17/2024 u/s 379 r/w 511 IPC and Sec 20 (2) of Treasury Trove Act కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా మూడనమ్మకాలతో ఇలా గుప్త నిధులు అంటూ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు.