తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు రెండోరోజూ కొనసాగింది. శనివారం ప్రారంభమైన సదస్సు మూడురోజుల పాటు జరుగుతుంది. పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు ధార్మిక సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రెండో రోజు ప్రారంభ ఉపన్యాసం చేశారు. హిందూ సనాతన ధర్మం ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనదని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. మానవులు ధర్మబద్ధంగా జీవించాలని తెలిపే హిందూ సనాతన ధర్మాన్ని ఆచరించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ఇతర మతాలకు చెందిన వారిని స్వాగతిస్తామని అన్నారు.
సనాతన హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా హిందూ ధర్మం పట్ల అపారమైన గౌరవం, విశ్వాసం గల ఇతర మతాలవారిని ఆహ్వానించేందుకు తిరుమలలో తగిన ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ ప్రణాళికలు రచిస్తోందని చెప్పారు. ఇతర మతాల భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే శ్రీ వేంకటేశ్వరస్వామివారి పాద కమలాల వద్ద హిందూ ఆచారాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అన్నారు.
తాను రాజకీయాల్లో ఉన్న సమయంలో కూడా భగవంతుడిని, సనాతన హిందూ ధర్మాన్ని వ్యతిరేకించలేదని కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.శ్రీ వేంకటేశ్వర స్వామివారి దయతోనే తాను రెండు సార్లు టీటీడీ ఛైర్మన్, మూడు సార్లు టీటీడీ బోర్డు సభ్యుణ్ని అయ్యానని చెప్పారు. తన ద్వారా ఇలాంటి గొప్ప పనులు చేయించాలనే స్వామివారు తనకు ఈ అదృష్టం ప్రసాదించారని అన్నారు భూమన. ధార్మిక సదస్సులో స్వామీజీలు అందించే సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని సనాతన హైంధవ ధర్మం పరిఢవిల్లేలా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.
మరోవైపు హిందూ ధర్మంలోకి రావాలనుకునే అన్య మతస్థులకు హిందూ ఆచారాలపై ట్రైనింగ్ ఇస్తామని టీటీడీ ఛైర్మన్ ముందుకు రావడాన్ని సదస్సులో పాల్గొన్న పీఠాధిపతులు అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల వలన సనాతన హిందూధర్మ వ్యాప్తి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.