అధికార వైఎస్సార్సీపీ చేపట్టిన ‘‘సిద్ధం’’ సభలపై ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ‘‘జగన్మోహన్ రెడ్డి గారు “ సిద్ధం” అంటుంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు, దేనికి సిద్దం?’’ అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకం, ఆశ్రిత పక్షపాతం మరో అయిదు సంవత్సరాలు కొనసాగుంచడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. రాష్ట్రంలో అన్యమత ప్రచారానికి, మతమార్పిడులకు ఊతమిచ్చే ప్రభుత్వం కొనసాగించడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. సంవత్సరం మొత్తం చదివి పరీక్షలు రాయడానికి ‘‘సిద్ధం’’ అయిన విద్యార్థుల పరీక్షలను రాజకీయ సమావేశం కోసం వాయిదా వేయడం వల్ల పిల్లలు ఒత్తిడికి గురయ్యారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నట్లుందని.. ప్రజలు రాష్ట్రంలో అసమర్థ పాలన నుంచి విముక్తి కోసం సిద్ధం అయ్యారన్నారు. దేశంలో నరేంద్ర మోడీ పాలన భారీ మెజారిటీతో కొనసాగించడానికి, రాష్ట్రంలో పాలన మార్పు కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని లంకా దినకర్ వ్యాఖ్యలు చేశారు.