పర్చూరు నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. పోలీసుల తీరుపై న్యాయస్థానం మండిపడింది. ఏడేళ్ల జైలు శిక్షకు వీలున్న కేసుల్లో ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. పోలీసులు అరెస్టు చేస్తారని భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి?.. అరెస్ట్ చేయనివ్వండి, అందుకు బాధ్యులైన అధికారులు పరిణామాలు ఎదుర్కొంటారని పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించని అధికారులను లోపలకి పంపిస్తామని, ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేటట్లు లేదని వ్యాఖ్యనించింది. దీంతో వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానాన్ని కోరడంతో తదుపరి విచారణ మంగళవారం నాటికి వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ కోరుతూ పర్చూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ కంపెనీల్లో ఇటీవల తనిఖీలకు వచ్చిన మైనింగ్ అధికారుల విధులకు ఆటంకం కలగించారని ఆరోపిస్తూ ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాలాజీ నాయక్ మార్టూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే ఏలూరి హైకోర్టును ఆశ్రయించారు.