ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లైన వ్యక్తితో రిలేషన్.. ‘మిస్’ చేజారిన అందాల కిరీటం

international |  Suryaa Desk  | Published : Tue, Feb 06, 2024, 10:19 PM

అందాల పోటీల్లో విజేతగా నిలిచిన జపాన్ సుందరికి ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లైన వ్యక్తితో రిలేషన్‌షిప్ నడుపుతున్న బయటపడటంతో కిరీటాన్ని వెనక్కి తీసుకున్నారు నిర్వాహకులు. రెండు వారాల కిందట జరిగిన మిస్ జపాన్ పోటీల్లో ఉక్రెయిన్‌లో పుట్టిన కరోలినా షినో (26) విజేతగా నిలిచింది. అయితే, ఆమె అసలు జపాన్ పౌరురాలు కాదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇది షినో వారసత్వంపై బహిరంగ చర్చకు దారితీసింది. కొందరు దీనిని స్వాగతించగా.. మరికొందరు ఆమె సాంప్రదాయ జపాన్‌కు ప్రాతినిధ్యం వహించకుని విమర్శించారు.


ఈ చర్చల మధ్య స్థానిక పత్రిక ఒకటి ఆమె ఓ వివాహితుడితో సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ కథనం ప్రచురించింది. పెళ్లైన వైద్యుడితో సంబంధం కొనసాగిస్తోందని మ్యాగిజైన్ కథనం నివేదించింది. గత వారం బయటకు వచ్చిన నివేదికను తోసిపుచ్చిన మిస్ జపాన్ పోటీ నిర్వాహకులు.. షినోకు మద్దతుగా నిలిచారు. అయితే, అతడికి వివాహం అయినట్టు ఆమెకు తెలియదని చెప్పారు. కానీ, సోమవారం ఈ వ్యవహారం మలుపుతిరిగింది. ఆ డాక్టర్‌కు వివాహమైన విషయం, కుటుంబం గురించి ముందే తనకు తెలుసనని షినో అంగీకరించారు.


తప్పుదోవ పట్టించినందుకు ఆమె క్షమాపణలు చెప్పిన ఆమె.. తన కిరీటాన్ని నిర్వాహకులకు అందజేశారు. ఆమె నిర్ణయాన్ని ఆమోదించినట్టు మిస్ జపాన్ అసోసియేషన్ వెల్లడించింది. షినో ఓ ప్రకటనలో తన అభిమానులు, సాధారణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. నివేదికకు ప్రతిస్పందనగా తాను కిరీటాన్ని అప్పగించినట్టు తెలిపింది. ‘నా వల్ల కలిగిన భారీ ఇబ్బందులు.. నాకు మద్దతు ఇచ్చిన వారికి ద్రోహం చేసినందుకు నేను నిజంగా చింతిస్తున్నాను’ అని ఆమె చెప్పింది.


కిరీటాన్ని వెనక్కి ఇచ్చేయడంతో ఈ ఏడాది మాత్రం మిస్ జపాన్ టైటిల్‌‌ ఖాళీగా ఉంటుందని, రన్నరప్‌లకు ఇవ్వడం లేదని నిర్వాహకులు తెలిపారు. జనవరి 22న జరిగిన మిస్ జపాన్ పోటీల్లో విజేతగా నిలిచిన షినో.. ఈ గౌరవం పొందిన మొదటి యూరోపియన్ సంతతికి చెందిన వ్యక్తి. షినో. ఆమెకు ఐదేళ్ల వయసున్నప్పుడు షినో తల్లి జపాన్ వ్యక్తిని పెళ్లాడారు. ఆ వెంటనే తల్లితో పాటు ఆమె ఉక్రెయిన్‌ వీడి జపాన్‌ వచ్చేసింది. అనర్గళంగా జపనీస్ మాట్లాడే షినో.. 2022లో జపాన్ పౌరసత్వం పొందారు.  టైటిల్ అందుకున్న తర్వాత ఆమె మాట్లాడుతూ... ‘నన్ను జపాన్ పౌరురాలిగా అంగీకరించలేదు.. చాలా పోరాటం చేయాల్సి వచ్చింది.. పదేపదే జాతి వివక్షను ఎదుర్కొన్నా.. కానీ ఈ రోజు గుర్తించినందుకు నా మనసంతా కృతజ్ఞతలతో నిండిపోయింది’ అని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com