అన్నమయ్య జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లర్ల చేతిలో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్న కానిస్టేబుల్ కుటుంబానికి 30 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ విషయాన్ని అన్నమయ్య జిల్లా ఎస్పీ రామకృష్ణ వెల్లడించారు. చనిపోయిన కానిస్టేబుల్ గణేష్ కుటుంబానికి అన్నిరకాలుగా అండగా ఉంటామని అన్నారు. అలాగే ఘటన ఎలా జరిగిందనేదీ ఆయన వివరించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందనే సమాచారంతో ఆర్‌ఎస్‌డీఎఫ్ ఆపరేషన్ చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. వాహనాలలో తరలిస్తున్నారనే సమాచరంతో పలు చోట్ల తనిఖీలు నిర్వహించామని వివరించారు. ఈ క్రమంలోనే పోలీసులను గమనించిన స్మగ్లర్లు వాహనాన్ని మరోవైపు మళ్లించారని.. ఆ సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ను ఢీకొట్టినట్లు వెల్లడించారు. కానిస్టేబుల్ గమనించకపోవటంతో స్మగ్లర్ల వాహనం అతన్ని ఢీకొట్టిందనీ, ఈ ఘటనలో కానిస్టేబుల్ గణేష్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్న అన్నమయ్య జిల్లా ఎస్పీ.. కానిస్టేబుల్ గణేష్ కుటుంబానికి 30 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటించిందన్నారు.
సోమవారం రాత్రి కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందని అన్నమయ్య జిల్లా పోలీసులు సమాచారం అందింది. దీంతో సుండుపల్లి సరిహద్దు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. మంగళవారం తెల్లవారుజామున తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్ గణేష్‌ను కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ గణేష్ తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు ఘటన తర్వాత పరారైన ముగ్గురు స్మగ్లర్లు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు.