రాజకీయ పార్టీలు మనుగడ సాగించాలంటే వివిధ రకాల కార్యక్రమాలు, ఉద్యమాలు చేయాల్సి ఉంటుంది. వీటన్నింటికీ డబ్బు అవసరం ఉంటుంది. అలాగే ప్రస్తుత పాలిటిక్స్‌లో ఆర్థికంగా బలంగా ఉన్న పార్టీలో ఎక్కువ కాలం పాలిటిక్స్‌లో నిలిచే అవకాశాలున్నాయి. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం విరాళాలు వద్దంటున్నారట. వచ్చిన చెక్‌లను సైతం వెనక్కి ఇచ్చేయండని పార్టీ ముఖ్యనేతలకు క్లారిటీగా చెప్పేశారట. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ ప్రచారం కోసం, సభల కోసం ఫండ్స్ అవసరమవుతాయి. కానీ ఇలా వచ్చిన విరాళాలను పవన్ వెనక్కి ఇచ్చేయడం వెనుక వేరే కారణం ఉందని తెలిసింది.
జనసేన పార్టీ గత కొంతకాలంగా విరాళాల సేకరణ మొదలెట్టింది. స్కాన్ చేయడం ద్వారా డొనేషన్లు అందివ్వాలంటూ పార్టీ కార్యకర్తలను, అభిమానులకు ఆన్‌లైన్ వేదికగా కోరుతోంది. ఈ క్రమంలోనే కొంతమంది ప్రముఖులు పవన్ కళ్యాణ్‌ను కలిసి పార్టీకి విరాళాలు అందిస్తున్నారు. అయితే పార్టీకి డొనేషన్ ఇచ్చిన నేతలు, ప్రముఖులు టికెట్లు కూడా అడుగుతున్నారట. ఈ నేపథ్యంలో నేతల తీరుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీని నమ్ముకుని ఇన్నిరోజులు పనిచేసిన నేతలను కాదని.. ఇప్పుడిప్పుడు వచ్చి విరాళం ఇచ్చి టికెట్ అడుగుతున్న ప్రముఖులపై పవన్ సీరియస్ అయ్యారని సమాచారం.
ఈ విషయంపై పార్టీ ముఖ్యనేతలు, సిబ్బందితో మాట్లాడిన జనసేనాని.. సీట్లు అడిగిన ప్రముఖుల చెక్‌లను వెంటనే వెనక్కి పంపాలని ఆదేశించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన నేతలు కొంతమందికి చెక్‌లను కూడా వెనక్కి ఇచ్చేశారని సమాచారం . మంగళవారం ఒక్కరోజే ఏడుగురికి చెక్‌లను పవన్ వెనక్కి పంపించినట్లు తెలిసింది. మిగతావారికి కూడా జనసేన కీలక నేతలు ఫోన్లు చేసి చెక్‌లను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నట్లు సమాచారం. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇలా చేయడం వెనుక మరో కారణం కూడా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్టీలోకి చేరకుండానే ఇలా విరాళాల ఆశ చూపడం ద్వారా పవన్ మీద ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైసీపీ సానుభూతిపరులు ప్రయత్నిస్తున్నారనే డౌట్ కూడా జనసేనానికి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పార్టీకి విరాళాలు అందించేవారి విషయంలో నిక్కచ్చిగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.