మాజీ ప్రధాని చరణ్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఈ క్రమంలోనే రాజకీయంగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఇండియా కూటమిలో ఉన్న చరణ్ సింగ్ మనవడు, రాష్ట్రీయ లోక్‌దళ్-ఆర్ఎల్‌డీ పార్టీ అధినేత జయంత్ చౌదరీ.. బీజేపీతో పొత్తుకు దాదాపు సిద్ధమైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జయంత్ చౌదరీని తమ వైపు తిప్పుకోవాలని భావిస్తున్న బీజేపీ.. తాజాగా చరణ్ సింగ్‌కు భారతరత్న ఇవ్వడంతో ఆర్ఎల్‌డీ పార్టీ ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్ నెరవేరింది. ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీతో కలిసి ఎన్డీఏలో చేరేందుకు జయంత్ చౌదరీ రంగం సిద్ధం చేసుకున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే తమ పార్టీ ఎన్డీఏలో చేరడంపై ఆర్ఎల్‌డీ చీఫ్ జయంత్ చౌదరీ పరోక్ష సంకేతాలు ఇచ్చారు. జయంత్ చౌదరీ తాత, మాజీ ప్రధాని చరణ్ సింగ్‌కు తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ భారతరత్న ప్రకటించడంతో.. దానిపై ఆయన స్పందించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై జయంత్ చౌదరి సంతోషం వ్యక్తం చేశారు. తన తాత చరణ్ సింగ్‌కు భారతరత్న రావాలనే తన చిరకాల స్వప్నం నెరవేరిందని జయంత్ చౌదరీ వెల్లడించారు. అయితే చరణ్ సింగ్‌కు కేంద్రం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ఎన్డీఏలో చేరాలని.. బీజేపీ ఇచ్చిన ఆఫర్‌పై మీడియా ఆయనను ప్రశ్నించింది. అయితే ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన జయంత్ చౌదరీ.. ప్రస్తుత సందర్భంలో ఓట్లు, సీట్ల అంశం అంత ముఖ్యమైంది కాదని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే ఆయన ఇచ్చిన అస్పష్టమైన సమాధానంతో సంతృప్తి చెందని మీడియా ప్రతినిధులు జయంత్ యాదవ్‌కు మరిన్ని ప్రశ్నలు సంధించారు. చరణ్ సింగ్‌కు భారతరత్న వచ్చిన నేపథ్యంలో ఆర్ఎల్‌డీ.. ఇండియా కూటమిలోనే ఉంటుందా లేక బీజేపీ ఇచ్చిన ఆఫర్‌ను అందిపుచ్చుకుంటుందా అని ప్రశ్నించారు. దాంతో ఇలాంటి సందర్భంలో బీజేపీ ఇచ్చిన ఆఫర్‌ను ఎలా తిరస్కరించగలమని జయంత్ చౌదరీ తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆర్ఎల్‌డీ పార్టీ ఎన్డీఏలో చేరి పోటీ చేస్తామని చెప్పకనే చెప్పారు. దీంతో జయంత్ చౌదరీ ఇండియా కూటమికి గుడ్ బై చెప్పనున్నారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.
అయితే ఇండియా కూటమిని వదిలి ఎన్డీఏలో చేరాలని ఇప్పటికే ఆర్ఎల్‌డీకి బీజేపీ ఆఫర్ ఇచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమకు కలిసి వస్తే 2 లోక్‌సభ సీట్లు ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో పాటు ఎన్నికల తర్వాత ఆర్ఎల్‌డీ పార్టీ నుంచి ఒకరిని రాజ్యసభకు పంపుతామని ఇటీవల జయంత్ చౌదరీకి బీజేపీ ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఇండియా కూటమిలో ఉన్న జయంత్ చౌదరి బీజేపీ ఆఫర్‌పై ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వడం.. దానిపై జయంత్ చౌదరీ స్పందించడంతో ఏదో జరగబోతోందన్న ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.