ఈడీ సోదాల్లో అవినీతి అధికారి బాగోతం బట్టబయలైంది. అవినీతికి పాల్పడి అడ్డగోలుగా సంపాదించిన అతడి ఆస్తుల చిట్టా చూసి ఈడీ అధికారులే నివ్వెరపోయారు. కోట్ల కొద్దీ కరెన్సీ కట్టలు, కోట్లాది విలువచేసే నగలు, విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత్ పట్నాయక్ నివాసంలో పక్కా సమాచారంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సమయంలో రూ. 4.5 కోట్ల నగదు, మరో రూ.34 కోట్ల విలువైన నగలు, పత్రాలు బయటపడ్డాయి.
హరిద్వార్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత్ పట్నాయక్ అటవీ భూముల కుంభకోణంలో నిందితుడిగా ఉన్నారు. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై కెనాల్ రోడ్‌లోని ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టింది. బుధవారం ఉదయం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఈ సోదాలు కొనసాగాయి. ఆయన ఇంట్లో ఏకంగా డబ్బు లెక్కించే మెషీన్లు చూసి ఈడీ అధికారులు విస్తుపోయారు. ఎన్వలప్ కవర్లలో కొంత నగదు పెట్టి, వాటిపై కొందరు ఐఎఫ్‌ఎస్, రేంజర్ స్థాయి అధికారుల పేర్ల రాసి ఉండటం ఈడీ గుర్తించింది.
త్వరలోనే వారిని కూడా విచారిస్తామని తెలిపింది. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి హరక్ సింగ్ నివాసంతో పాటు ఢిల్లీ, ఉత్తరాఖండ్ సహా దేశవ్యాప్తంగా 16 చోట్ల ఏకకాలంలో దాడులు చేపట్టినట్లు ఈడీ వెల్లడించింది. సుశాంత్ పట్నాయక్ నివాసంలో భారీగా నగదు పట్టుబడిన విషయం తెలియగానే ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన్ను తక్షణమే హెడ్ ఆఫీస్‌కు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. అయితే, జూనియర్ రిసెర్చ్ ఫెలో పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జనవరి 24న ఐటీ పార్క్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసులో మహిళను అభ్యంతరకరంగా తాకి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డిన విషయం బయటపడింది. పట్నాయక్ తండ్రి చనిపోవడంతో బాధితురాలు ఆయనను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ స్పందిస్తూ.. విచారణకు ఆదేశించారు. అటు, మనీల్యాండరింగ్ కేసులో మరో నిందితుడిగా ఉన్న మాజీ డివిజినల్ ఫారెస్ట్ అధికారి (DFO) ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయన నివాసంలోనూ సోదాలు జరిగాయి.