వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... మాజీమంత్రి నారాయణపై జగన్ రెడ్డికు ఇంకా పగ తీరినట్టు లేదన్నారు. నారాయణ ఇంట్లో సోదాలు చేయడం అన్యాయమని.. జగన్ వ్యక్తిగత కక్షకు ఇది పరాకాష్ట అని మండిపడ్డారు. హైకోర్టు ఉత్తర్వులు లేకుండా ఐదుగురు డీఎస్పీలు, 8 మంది సీఐలతో నారాయణ ఇంటిని సోదా చేయడం అక్రమమని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించడానికి సీఎం జగన్ వ్యవస్థలను ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనడానికి నారాయణ ఇంటి సోదాలే నిదర్శనమన్నారు. ప్రతిపక్ష నాయకులను భయాందోళనలకు గురిచేసేందుకు వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వమే ఎల్లప్పుడు అధికారంలో ఉంటుందనుకోవడం భ్రమేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది టీడీపీనేనని.. అప్పుడు సీఎం జగన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎంఏ షరీఫ్ హెచ్చరించారు.